ప్రత్యేక హోదా: ఏపీతో కేంద్రం ఈ ఆటలేంటి..?

కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ తో ఆటలాడుకుంటోందా.. అడ్డగోలు విభజన అంటూ ఇటీవల మోడీ ఏకంగా పార్లమెంట్‌లోనూ ఏపీకి జరిగిన అన్యాయం ఏంటో చెప్పారు.. అంతగా చెప్పిన మోడీ.. ఆ తర్వాత కూడా ఏపీతో ఆటలాడుకుంటున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో తాజాగా జరిగిన దోబూచులాట చూస్తే.. అసలు కేంద్రం మనసులో ఏముందో అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. రాష్ట్ర విభజనపై ఓ త్రిసభ్య కమిటీ వేశారు.. ఆ కమిటీ సమావేశంలో ప్రత్యేక హోదా అంశం మొదట చేర్చారు.. అయితే.. ఈ కమిటీ భేటీ అజెండాలో ప్రత్యేక హోదా ఎందుకు చేర్చారన్న విషయంపై స్పష్టత లేదు.


సరే.. ఏదో ఒకటి.. ప్రత్యేక హోదా అంటూ ఒకటి ఉంది అని కేంద్రం గుర్తించింది కదా అని ఏపీ వాసులు ఆనందించారు.. కానీ అంతలోనే సీన్ మారిపోయింది.. ఆ తర్వాత ఎజెండా నుంచి ప్రత్యేక హోదాను తొలగిస్తున్నట్టు హోం శాఖ ప్రకటించింది. అసలు.. కేంద్ర త్రిస‌భ్య క‌మిటీ ఎజెండా ఎందుకు మారింది.. హోంమంత్రిత్వ శాఖ వేసిన క‌మిటీకి అసలు ఎజెండా ఏమిటో తెలియకుండానే వేశారా.. హోంశాఖలో పని చేసే అధికారులకే క్లారిటీ లేదా.. ఇప్పుడు ఈ ప్రశ్నలే ఏపీ వాసుల్లో తలెత్తున్నాయి.


వాస్తవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్‌ గ్యాప్‌ అన్నవి చర్చించే అంశాలు కావు.. కానీ ఈ అంశాలను త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది అర్థం కాని విషయం. అలాగే... ఈ త్రిసభ్య కమిటీకి హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన జాయింట్‌ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారు. మరి ఈ స్థాయిలో ఉన్నవారికి  తమ పరిధిలోకి వచ్చే అంశాలు, రాని అంశాలు ఏవో తెలియకుండా ఉంటుందా..?


అసలు ముందు ఎందుకు ప్రత్యేక హోదా అంశం చర్చల ఎజెండాలో ఉందని ప్రకటించారు.. ఆ తర్వాత ఎందుకు మార్చారు.. ఇలా మార్చడానికి ఎవరైనా నేతలు పైరవీలు చేశారా.. ఇప్పుడు ఏపీ జనం మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. ఇంకెన్నాళ్లు ఏపీతో ఈ దోబూచులాటలు ఆడతారు.. మరి వీటికి సమాధానం ఎవరు చెబుతారు..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: