ఎన్నికల్లో కొత్త దృశ్యం..అంతా కరోనా మహిమ..?
ఎన్నికలంటేనే హంగూఆర్భాటం.. జోరుగా ఎన్నికల ప్రచారం.. మందీ మార్భలం వేసుకుని భారీగా బహిరంగ సభలు.. భారీగా జనాలను సమీకరించిన సభలు నిర్వహించడం.. ఆ సభలు ఎంత బాగా జరిగితే అంత గొప్ప.. ఆ సభలకు జనాన్ని ఎంత బాగా తీసుకొస్తే అంత గొప్ప.. ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు క్రమంగా కనుమరుగువుతున్నాయి. ఇది కరోనా తెచ్చిన మార్పుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ.. అక్కడ మనం పైన చెప్పుకున్న దృశ్యాలేమీ కనిపించడం లేదు.
ఐదు రాష్ట్రాల్లో జరగుతున్నవి కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు అయినా అక్కడ పెద్దగా సందడి కనిపించడం లేదు. కరోనా నిబంధనల కారణంగా భారీ ర్యాలీలకు, రోడ్ షోలకు అనుమతి లేదు.. ఇంటింటి ప్రచారంలో ఐదుగురికి మించి అనుమతి లేదు. అందుకే ఇప్పుడు అంతా సోషల్ మీడియా ప్రచారమే సాగుతోంది. మహా మహా నాయకులే వర్చువల్ సభల ద్వారా ప్రసంగిస్తున్నారు.
బహిరంగ ప్రదర్శలు లేవు.. భారీ ర్యాలీలు లేవు. ప్రచార ఆర్భాటం లేదు..బహుశా ఇలా అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇండియాలో ఇదే తొలిసారి.. ఇంతకుముందు బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కరోనా సమయంలో ఎన్నికలు జరిగినా అక్కడ ఇలాంటి నిబంధనలు అమలు కాలేదు. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తర్వాత కఠిన నిబంధలు వచ్చాయి. ఎన్నికల పద్దతిలో సమూల మార్పులకు అవకాశం వచ్చింది. ఎన్నికల ప్రచారంలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇక మళ్లీ పాత తరం ప్రచార ఆర్భాటాలు కనిపించవేమో.. కనిపించకపోవడమే మంచిదేమో.. అనవసర ఖర్చులు తగ్గుతాయి. దీని వల్ల ప్రజాస్వామ్యానికి మేలే జరుగుతుంది. ఏమంటారు.. ?