కొత్త జిల్లాలు: కేసీఆర్, జగన్.. ఎవరి రూటు రైటు?


ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను మరో 13కు పెంచి 26 జిల్లాలుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్లను విడుదల చేసింది. వీటిలో అభ్యంతరాలు ఉంటే.. ఎవరైనా 30 రోజుల్లో తెలపవచ్చు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి కొన్ని మార్పులు కూడా చేయొచ్చు. మొత్తానికి ఏపీలోనూ జిల్లాలు పెరగబోతున్నాయి. తెలంగాణ ఈ ప్రయోగం ఇప్పటికే చేసేసింది. గతంలో ఉన్న 10 ఉమ్మడి జిల్లాలను ఏకంగా కేసీఆర్ 33 జిల్లాలుగా మార్చేశారు.


చిన్న జిల్లాల వల్ల పర్యవేక్షణ బావుంటుందన్నది ఓ వాదన. అది కూడా నిజమే. అయితే ఈ జిల్లాల విభజనల విషయం అనేక వివాదాలు వచ్చాయి. ఏపీలో ఈ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి రాజంపేట, మదనపల్లి, మార్కాపురం, నరసాపురం వంటి చోట్ల ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. అయితే.. కొన్ని సంవత్సరాల తేడాలో ఏపీ, తెలంగాణ రెండింటిలోనూ జిల్లాల పునర్విభజన జరిగినా ఇందులో కొన్ని మౌలిక మైన మార్పులు ఉన్నాయి.


అదేంటంటే.. తెలంగాణలో జిల్లాల పునర్విభజన సమయంలో.. జిల్లాలోని ఏ ప్రాంతం కూడా జిల్లా  కేంద్రానికి 60-70 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండకూదని భావించారు. ఏవో ఒకటి , రెండు చోట్ల తప్ప దాదాపు అన్నిచోట్లా ఈ దూరం పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీని వల్ల జిల్లాల విభజన కాస్త గందరగోళంగానే మారింది. ఒక నియోజకవర్గం 3,4 జిల్లాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది.

 

జగన్ సర్కారు మాత్రం.. పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఒక జిల్లాగా చేయాలని రూల్ పెట్టుకున్నారు. అందువల్ల జిల్లాల సంఖ్య ఫిక్స్‌డ్‌గా 25 ఉంది. దీనికి తోడు అరకు ఎంపీ స్థానాన్ని మూడు జిల్లాలుగా విభజించడం వల్ల కొత్త జిల్లాలతో కలిపిన రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాలు ఏర్పడ్డాయి. దీనివల్ల కొన్ని జిల్లాలు పెద్దవి అయ్యాయి. వాటిలో జిల్లా కేంద్రం నుంచి ఓ పల్లెకు వెళ్లాలంటే.. 150 కిమీ వెళ్లాల్సిన జిల్లాకు కూడా ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏది కరెక్టని చెప్పడం అంత సులభం కాదు. రెండింటిలోనూ కొన్ని సౌలభ్యాలు, చిక్కులూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: