ఉద్యోగులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించనున్న జగన్..?
అయితే.. ఉద్యోగులు సమ్మెబాట పడితే మాత్రం ఎస్మా ప్రయోగించే అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్ వంటి శాఖల ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఆ పరిస్థితి ఉత్పన్నమైతే.. పరిస్థితి ఎలా అన్న విషయంపై ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది. ఏం చేయాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. ఉద్యోగులను దారికి తెచ్చేందుకు అత్యవసర సేవల చట్టం ఎస్మా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ఎప్పుడూ ప్రభుత్వాలు బెదిరిస్తూనే ఉంటాయి. కానీ ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ ఎస్మా చట్టం ప్రయోగించిన దాఖలాలు తెలుగు రాష్ట్రాల్లో లేవు. గతంలో తమిళనాడులో మాత్రం జయలలిత సర్కారు ఇలాగే ఉద్యోగులతో ఘర్షణ పడి.. ఏకంగా వేల మంది ఉద్యోగులను ఎస్మా చట్టం ప్రయోగించి ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో ఉద్యోగులు దారికి వచ్చారని చరిత్ర చెబుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడు సమ్మె జరిగినా.. కొన్నిరోజులకు చర్చలతో సమస్య పరిష్కారం అవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఈ సారి మాత్రం తాము సమ్మె కొనసాగించి తీరతామని ఉద్యోగులు అంటున్నారు. ఎన్నడూ లేనిది జీతాలు తగ్గించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి విషయం సమ్మె.. ఎస్మా ప్రయోగం వరకూ వెళ్తుందా.. లేక.. ఒకటి, రెండు రోజుల్లో చర్చల ద్వారా ఫలితం వస్తుందా అన్నది వేచి చూడాలి. కార్మిక సంఘాలు ఆరో తారీకు అర్థరాత్రి నుంచి సమ్మెబాట పట్టనున్నాయి. మరి ఆ లోపు సమస్య పరిష్కారం అయితే.. అందరికీ మంచిది.