టీడీపీ అభిమానుల చిరకాల కోరిక తీర్చిన జగన్..?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. ప్రత్యర్థి పార్టీ టీడీపీ అభిమానుల చిరకాల వాంఛ తీర్చేశారు.. కృష్ణా జిల్లాకు అన్న నందమూరి తారక రామారావు పేరు పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ఎన్టీఆర్‌ అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. కృష్ణా జిల్లాను రెండుగా చేసి.. విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లా అని నామకరణం చేశారు. ఇక మిగిలిన కృష్ణా జిల్లా అదే పేరుతో మచిలీపట్నం కేంద్రంగా ఉంటుంది.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కోరిక ఇప్పటిది కాదు.. అన్నా అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే నందమూరి తారక రామారావు 1996లో కన్నుమూసినప్పటి నుంచి ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. అప్పట్లో అధికారంలో ఉన్నది తెలుగు దేశమే.. ఆ తర్వాత కూడా తెలుగు దేశం 1999లోనూ.. అధికారంలోకి వచ్చింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ అభిమానుల కోరిక తీర్చలేదు. ఆ తర్వాత పదేళ్ల పాటు అధికారానికి దూరమైన టీడీపీ మళ్లీ రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చినా ఎన్టీఆర్ అభిమానుల కోరిక నెరవేరలేదు.

చంద్రబాబు 2014లో నిర్మించ తలపెట్టిన అమరావతి రాజధానికే ఎన్టీఆర్ నగర్ అని పేరు పెడతారని భావించారు. అది కూడా సాకారం కాలేదు. చివరకు ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక.. ఎన్టీఆర్ అభిమానుల కల నెరవేరింది.  విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా సాకారం అయ్యింది. ఇలా జిల్లాలకు ప్రముఖ నాయకుల పేర్లు పెట్టడం ఆంధ్రప్రదేశ్‌లో కొత్తేమీ కాదు. గతంలో మాజీ సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ప్రకాశం జిల్లా ఏర్పడింది.

ఆ తర్వాత నెల్లూరు జిల్లాకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. అయితే.. పొట్టి శ్రీరాములు పేరు పెట్టినా.. జిల్లా పేరులో నెల్లూరు అలాగే ఉంచడంతో అది అంతగా పాపులర్ కాలేదు. అలాగే కడప జిల్లాకు వైఎస్సార్ కడపగా నామకరణం చేసినా జనం కడప జిల్లా అనే అంటున్నారు. కానీ.. కృష్ణా జిల్లాను అలాగే ఉంచి ఎన్టీఆర్ జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయడంతో ఎన్టీఆర్ జిల్లా పాపులర్ కాక తప్పదు. మొత్తానికి జగన్ చేతుల మీదుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ కలనెరవేరిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: