జగన్ Vs ఉద్యోగులు: మధ్యలో ఆయన బకరా అయ్యారా?

ఆంధ్రప్రదేశ్‌లో  ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చేసింది. కొన్ని నెలల నుంచి సాగుతున్న ఈ పీఆర్సీ ఎపిసోడ్‌కు కొన్ని రోజుల క్రితం శుభం కార్డు పడినట్టే అనిపించింది. ఉద్యోగ సంఘాలు కొన్ని అంశాల్లో రాజీకి వచ్చాయి.. అటు ప్రభుత్వం కూడా అనుకోని వరాలు ప్రకటించి ఉద్యోగులను సంతృప్తి పరిచింది. ఇలా రెండు విధాలా లాభదాయకంగా పీఆర్సీ గొడవ ముగిసిందని భావించేలోపు.. మళ్లీ ఉద్యోగ సంఘాల నేతల ఆందోళనలతో మళ్లీ మొదటికి వచ్చేసింది.

అయితే.. ఈ పీఆర్సీ వ్యవహారంలో ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నేతలు అనేక సార్లు చర్చలు జరిపారు. ఆ తర్వాత సీఎంతో ఉద్యోగ సంఘాల నేతలు కూడా చర్చలు జరిపారు. ఫైనల్ గా ఓ అంగీకారానికి వచ్చారు. అయితే.. ఇప్పుడు వ్యవహారం మొత్తం చెడిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్సే కారణమని ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.

ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన అధికారి సరిగా వ్యవహరించటం లేదని ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా మీడియా ముందే చెబుతున్నారు. సీఎస్‌ సహా కొందరు అధికారులు సీఎంను తప్పు దోవ పట్టించారని భావిస్తున్నామని.. రాజకీయ కోణంలో చూస్తే ఏ సీఎం కూడా ఈ తరహా నిర్ణయం తీసుకుంటారని భావించడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. సెంట్రల్ పే కమిషన్ అమలు చేస్తామన్న ప్రభుత్వం.. రాష్ట్ర ఉద్యోగులపై అధికారాన్ని వదిలేసుకుంటారా అని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

పీఆర్సీపై జీవోలను నిలిపేయాలని.. మరో రెండు నెలల జాప్యమైనా ఫర్వాలేదని.. కానీ.. ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ ను కొనసాగించి ఉద్యోగులకు మేలు చేసేలా కసరత్తు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. అంతే కాదు.. ఈసారి ఏకంగా సీఎం నేతృత్వంలో కమిటీ వేయాలని.. తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మొత్తానికి ఈ విషయంలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య సీఎస్‌ బకరా అయ్యారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: