ఇండియా రూపురేఖలు మార్చేస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్.. వేగంగా విస్తరిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ..!
ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువలో భారీ వృద్ధి:
భారతదేశంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వినియోగదారులకు చేరిన ఆహారపు మొత్తం విలువ సుమారు రూ. 1.2 లక్షల కోట్లకు చేరింది. ఇది 2021–22లో నమోదైన రూ. 61,271 కోట్లతో పోలిస్తే దాదాపు రెండింతలు కావడం గమనార్హం. ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం వృద్ధి కంటే వేగంగా విస్తరిస్తూ, ఒక శక్తివంతమైన ఆర్థిక చోదక శక్తిగా అవతరించిందని నివేదిక పేర్కొంది.ఈ వృద్ధి ప్రభావంతో జాతీయ స్థూల దేశీయోత్పత్తి )లో ఫుడ్ డెలివరీ రంగం వాటా 0.14 శాతం నుంచి 0.21 శాతానికి పెరిగింది. ఇతర సేవా రంగాలతో పోలిస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయని ఎన్సీఏఈఆర్ స్పష్టం చేసింది.
ఫుడ్ డెలివరీ రంగం కేవలం హోటళ్లకే కాకుండా, వ్యవసాయం, రవాణా, లాజిస్టిక్స్, డిజిటల్ సాంకేతికత, ప్యాకేజింగ్ వంటి అనుబంధ రంగాలకు కూడా గణనీయమైన ఆర్థిక విలువను జోడిస్తోంది. నివేదిక ప్రకారం, ఫుడ్ యాప్స్ ద్వారా రూ. 10 లక్షల విలువైన కొత్త ఆర్డర్లు చేరితే, మొత్తం ఆర్థిక వ్యవస్థలో దాని ప్రభావంగా రూ. 20.5 లక్షల విలువైన అదనపు ఉత్పత్తి సృష్టించబడుతోంది. ఇది ఈ రంగం కలిగించే మల్టిప్లయర్ ఎఫెక్ట్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ ఉపాధి కల్పనలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశంలో ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 2021–22లో 10.8 లక్షల నుంచి, 2023–24లో 13.7 లక్షలకు పెరిగింది. ఈ రంగంలో కార్మికుల సంఖ్య ఏటా సగటున 12.3 శాతం వృద్ధి సాధిస్తోంది. ఇదే సమయంలో, ఇతర రంగాల్లో ఉపాధి వార్షిక వృద్ధి కేవలం 7.9 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
మరింత ముఖ్యంగా, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో ఒక వ్యక్తికి ప్రత్యక్షంగా ఉద్యోగం లభిస్తే, దాని ప్రభావంగా విస్తృత ఆర్థిక వ్యవస్థలో 2.7 అదనపు ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయని ఎన్సీఏఈఆర్ విశ్లేషించింది. ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల తమ వ్యాపార పరిధి విస్తరించిందని 59 శాతం రెస్టారెంట్లు వెల్లడించాయి. అలాగే, 52.7 శాతం రెస్టారెంట్ యజమానులు కొత్త వంటకాలను మెనూలో చేర్చామని తెలిపారు.
50.4 శాతం మంది కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.2019–23 మధ్య కాలంలో, ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా వచ్చే ఆదాయ వాటా 22 శాతం నుంచి 29 శాతానికి పెరిగింది.
ఇవి ఫుడ్ యాప్స్ రెస్టారెంట్ వ్యాపారాన్ని మరింత సాంకేతికంగా, వినియోగదారుల కేంద్రంగా మార్చినట్లు సూచిస్తున్నాయి.
*ఫుడ్ యాప్స్ వినియోగంలో భారత్ ప్రపంచ అగ్రస్థానం
*ఫుడ్ డెలివరీ యాప్స్ వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
*ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో 19.4 కోట్ల మంది ఫుడ్ యాప్స్‌ను వినియోగిస్తున్నారు.
*కేవలం రెండు సంవత్సరాల క్రితం ఈ సంఖ్య 6 కోట్లకు మాత్రమే పరిమితమైంది.
*ఈ కాలంలో యూజర్ల సంఖ్య మూడు రెట్లు కంటే ఎక్కువగా పెరిగింది.
*ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఫుడ్ యాప్ డౌన్‌లోడ్స్‌లో భారత్ వాటా 43.79 శాతంగా నమోదైంది.
మొత్తంగా చూస్తే, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ భారతదేశంలో వినియోగ అలవాట్లను మార్చడమే కాకుండా, ఆర్థిక వృద్ధి, ఉపాధి సృష్టి, చిన్న వ్యాపారాల విస్తరణకు కీలక భూమిక పోషిస్తున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.