జగన్ కష్టం మొత్తం వృథా.. మళ్లీ సమస్య మొదటికి..?

ఏపీ ప్రభుత్వం ఇటీవల పీఆర్సీ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం  ఫిట్‌మెంట్‌ ప్రకటించింది. దీనికి ఉద్యోగ సంఘాలు మొదట కాస్త నిరాకరించినా.. రెండేళ్ల పదవీ విరమణ గడువు పెంపు, ఇళ్ల స్థలాల్లో 10 శాతం కేటాయింపు, అన్ని డీఏలు ఒకేసారి ఇస్తామన్న హామీ.. ఇలాంటి నిర్ణయాలతో కాస్త మెత్తబడ్డారు. మొత్తానికి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి ఓకే చెప్పేశారు. అయితే.. ఆ తర్వాత ఉద్యోగుల్లో అంతర్మథనం మొదలైంది. కొత్త పీఆర్సీతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అసంతృప్తితో ఉన్న విషయం  ఉద్యోగ సంఘాల నేతలకు తెలిసొచ్చింది.

దీంతో ఉద్యోగ సంఘాల నేతలు మళ్లీ పునరాలోచనలో పడిపోయారు. ఉద్యోగుల్లోని అసంతృప్తిని క్రమంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  సీఎంవో అధికారులతో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు గత ప్రభుత్వం కల్పించిన రాయితీల్లో కోతలు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో చర్చల సమయంలోనే హెచ్ఆర్ఏ, సీసీఏపై సీఎస్‌తో మాట్లాడాలని సీఎం తమకు సూచించారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు.

ప్రభుత్వం.. ఉద్యోగులందరిని ఒకే కేటగిరీ చేసి హెచ్ ఆర్ ఏ తగ్గించేందుకు ప్రయత్నిస్తోందన్నది ఉద్యోగ సంఘ నేతల వాదన. ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టే తమ కార్యాచరణ ఉంటుందంటున్న నేతలు డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్తామని చెబుతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హెచ్‌ఆర్‌ఏ స్లాబులను కేంద్ర ప్రభుత్వ స్లాబులతో పోల్చటం సరికాదంటున్న నేతలు..  సచివాలయ హెచ్‌వోడీ ఉద్యోగులు 22 శాతం, జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులు దాదాపు 12 శాతం, మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు 6.5శాతం, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు 4.5శాతం హెచ్‌ఆర్‌ఏ కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు.

మొత్తానికి ఉద్యోగ సంఘాల నేతల మాటలు చూస్తుంటే.. మరోసారి పీఆర్సీకి వారిని ఒప్పించేందుకు జగన్ సర్కారు చేసిన కృష్టి అంతా బూడిదలో పోసిన పన్నేరేనా అనిపిస్తోంది. మరి ఈ ఉద్యోగ సంఘాల నేతలను జగన్ సర్కారు ఎలా సంతృప్తి పరుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: