జగన్‌.. వన్‌టైమ్‌ వండర్‌గా మిగిలిపోతారా?

ఏపీ సీఎం జగన్‌ సీఎంగా దాదాపు మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోబోతున్నారు. ఇటీవలి కాలంలో సీఎం అయిన యువ నాయకుడు జగనే.. ఆయన సీఎం కావడం కూడా అలా ఇలా కాలేదు.. ఏకంగా 175 ఎమ్మెల్యే సీట్లలో ఏకంగా 151 సీట్లు గెలుచుకుని బంపర్ మెజారిటీతో సీఎం అయ్యారు. అంటే దాదాపు 80 శాతంపైగా సీట్లు గెలుచుకున్నారు. ఇంత బంపర్‌ మెజారిటీ బహుశా వైసీపీ నేతలు కూడా ఊహించి ఉండరు. చంద్రబాబు పాలనపై విసిగిపోయారో.. జగన్ ఇచ్చిన హామీలకు మురిసిపోయారో తెలియదు కానీ.. ఓట్లు మాత్రం వైసీపీకి గంపగుత్తగా గుద్దేశారు.

మరి అంత మెజారీటీ సీఎం అయిన జగన్ పాలన ఎలా సాగుతోంది.. జనం ఆయనపై పెట్టుకున్న అంచనాలు అందుకున్నారా.. జనం ఆయన పాలనపై సంతృప్తిగా ఉన్నారా.. మూడేళ్లలో సీఎంగా జగన్ సాధించిందేంటి.. అని ఆలోచిస్తే మిశ్రమ ఫలితాలే కనిపిస్తాయి. జగన్ సీఎం అయ్యాక ఆయన తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. నవరత్నాలు వంటి హామీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చెప్పామంటే చేయాలి అన్న రీతిలో ఆ పథకాలకు అత్యధికంగా నిధులు ఖర్చు చేశారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే విషయంలోనూ పురోగతి సాధించారు. గ్రామ సచివాలయాల కాన్సెప్టుతో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువు చేశారు. గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ కూడా గ్రామీణులకు బాగా ఉపయోగపడుతోంది. అయితే.. సంక్షేమం మాటున అభివృద్ధి పూర్తిగా మూలకు పడిందన్న విమర్శలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. కొత్త పరిశ్రమలు వచ్చింది లేదు. కొత్తగా ఉపాధి మార్గాలు కనిపించడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. అప్పులు పెరుగుతున్నాయి. ఇవీ జగన్ సర్కారుపై వస్తున్న కంప్లయింట్స్.

అంతే కాదు.. కక్ష సాధింపు.. రాజధాని విషయాన్ని గందరగోళంలో పడేయడం వంటి అంశాలు మైనస్‌గా మారుతున్నాయి. మరి మిగిలిన రెండేళ్లలో జగన్ తన పాలనతో ఆకట్టుకుంటారా.. ఏపీలో ఇంకా బలంగానే ఉన్న టీడీపీకి అధికారం అప్పగించి వన్‌ టైమ్‌ వండర్‌గా మిగిలిపోతారా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: