బిగ్‌ డౌట్‌: మోడీతో జగన్... గంటా.. అరగంటా..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు.. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. సాధారణంగానే ముఖ్యమంత్రులు అప్పుడప్పడు ప్రధానమంత్రిని కలుస్తుంటారు. అలా కలిసిన ముఖ్యమంత్రులు.. తమ తమ రాష్ట్రాల్లో సమస్యలు వివరించుకుని.. కాస్త చూడండయ్యా అంటూ విజ్ఞప్తి చేసుకుంటారు. ఇంతదాకా వచ్చి చెప్పారు కాబట్టి అబ్బే నావల్ల కాదు అంటే బావుండదు కాబట్టి ప్రధాని కూడా .. ఓ తప్పకుండా చేద్దాం.. అదెంత పని అన్నట్టు మాటలు చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత ఆ పని జరుగుతుందా.. జరగదా అన్నది తర్వాత సంగతి. ఇదీ సాధారణంగా జరిగేది.

అయితే.. ఏపీ సీఎం జగన్‌ ఎప్పుడు ప్రధాన మంత్రిని కలిసినా మీడియాలో అనేక ఊహాగానాలు వస్తాయి.. కేసులు కోసం వెళ్తున్నాడని కొన్ని మీడియాలు రాస్తాయి.. ఇంకేముంది జగన్ వెళ్లి సాక్షాత్తూ మోడీ కాళ్లు పట్టుకుని భోరున విలపించాడని మరో పత్రికాధిపతి అన్నీ చూసినట్టే చెప్పేస్తారు. అయితే అసలు లోపల ఏం జరిగిందన్నది చాలాసార్లు ఎప్పటికీ బయటకు రానే రాదు. అసలు విషయం తేలాలంటే.. ప్రధానితో మాట్లాడివచ్చిన సీఎం జగన్ మీడియాకు చెప్పాలి. సాధారణంగా ప్రధానిని కలిసిన వారు బయటకు వచ్చి.. అది అడిగాను.. ఇది అడిగాను.. దానికి ఆయన అలా స్పందించారు..ఇలా స్పందించారని చెప్పుకుంటారు.

కానీ.. మన జగన్ మాత్రం ఎప్పుడూ ప్రధానికి కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడరు. అలా ప్రధానితో జగన్ భేటీ ముగుస్తుందో లేదో.. వెంటనే అన్ని మీడియా ప్రతినిధులకు ఓ వాట్సప్ మెస్సేజ్‌ చేరిపోతుంది.. అది సీఎం జగన్ పీఆర్వోల నుంచి.. ఏమని.. ఆయన ప్రధానిని ఏ ఏ అంశాలపై అడిగారు.. ఏం చర్చించారు.. అనే విషయాలు కూలకషంగా అందులో వివరించి ఉంటాయి. అయితే అదంతా నిజమే అనుకుని నమ్మేయకూడదు.

ఎందుకంటే.. ఇవాళ ఇచ్చిన ప్రెస్‌ మీట్‌లో చాంతాడంత లిస్టు అడిగినట్టు ప్రెస్ నోట్ వచ్చింది. కానీ.. జగన్ ప్రధానితో భేటీ అయ్యిందే గట్టిగా అరగంట. అరగంటలో ఈ విషయాలన్నీ అడిగారని పీఆర్వోలు చెప్పినా ఎలా నమ్ముతాం చెప్పండి. ఆ జాబితా చదవాలంటేనే కనీసం గంట పడుతుంది. మరి ఇంతకీ జగన్ సీఎంను కలిసింది గంటా.. అరగంటా అన్న సందేహం ఆ ప్రెస్‌నోట్‌ చూడగానే వచ్చేస్తుంది. అయినా చేసేదేముంది.. ఆ పీఆర్వో నోట్‌లో జరిగినట్టు నమ్మాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: