ఈసీ చేస్తున్న తప్పుకు ఇండియా భారీ మూల్యం?

ఉత్తరప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. యూపీలోని రాజకీయ పార్టీలన్నీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు కావాలని అడిగాయని.. తాము అన్ని పార్టీలను సంప్రదించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.  ఎన్నికలు ప్రజాస్వామ్య యుతంగా సాఫీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఈసీ అంటోంది. అయితే.. ఇండియాలో ఓవైపు కరోనా పరిస్థితులు మళ్లీ తిరగబెడుతున్నాయి. ఒమిక్రాన్ పుణ్యమో ఏమో కానీ.. మళ్లీ దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ ఊపందుకుంటోంది.

యూపీ ఎన్నికలపై ఈసీ తీసుకున్న నిర్ణయం చూస్తే.. ఈసీ గతంలో చేసిన తప్పే మళ్లీ చేస్తుందా అన్న అనుమానం వస్తోంది. గత ఏడాది బెంగాల్ తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనూ అదే జరిగింది. ఎన్నికలకు కరోనా షరతులతో ప్రచారం చేసుకోమని ఈసీ అనుమతి ఇచ్చింది. కానీ పార్టీలు మాత్రం కరోనా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చాయి. దీంతో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కరోనా విజృంభించింది. ఆ తర్వాత సెకండ్‌ వేవ్‌ వచ్చింది.

ఇప్పుడు కూడా సేమ్ అదే సీన్ జరగబోతోందేమో అనిపిస్తోంది. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో కీలకమైన అంశమే.. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ.. భారీ ర్యాలీలు, బహిరంగ సభలు లేకుండా ఎన్నికలు నిర్వహించలేమా.. అంతా డిజిటల్ మయం అవుతున్న ఈ రోజుల్లోనూ భారీగా జనాన్ని సేకరించి సభలు నిర్వహించాలా.. ఈసీ కూడా ఇలాంటి కఠినమైన నిబంధనలు విధించకుండా ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం అది చాలా పెద్ద తప్పే అవుతుంది.

ఇప్పటికే ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్టు సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే.. కరోనా కారణంగా ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. అయితే.. ఈ వేరియంట్ ఎప్పుడైనా వయొలెంట్‌గా మారే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు ఒక్కసారిగా పంజా విప్పితే మాత్రం భారత్‌ మరోసారి ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. చూడాలి ఈసీ ఈ ముప్పు నుంచి ఎలా తప్పిస్తుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: