కేసీఆర్ నుంచి జగన్ ఆ క్వాలిటీ ఎప్పుడు నేర్చుకుంటారో..?

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వారు నాయకుడు.. ఇది పవన్ కల్యాణ్ సినిమాలో డైలాగ్.. కానీ.. రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. నాయకుల్లో కూడా అనేక మంది తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అంటూ తమ వాదనకే ప్రాధాన్యం ఇస్తారు. అంతే తప్ప.. తమ నిర్ణయంలో ఏమైనా తప్పుందేమో అని ఆలోచించేవాళ్లు చాలా తక్కువ. అలాంటి తక్కువ మంది నేతల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరని చెప్పుకోవచ్చు.

కేసీఆర్ అంటే మంచి రాజకీయ వ్యూహకర్త అన్న విషయం తెలిసిందే. ఆయన పట్టుదల వస్తే ఎంత గట్టిగా పట్టుబడతారో.. అదే సమయంలో తమ నిర్ణయంలో ఏదైనా లోపంగా భావిస్తే వెంటనే సర్దుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు. అరే ఇన్నాళ్లూ ఒక నిర్ణయంతో వెళ్లాం.. తప్పయినా ఒప్పయినా అదే నిర్ణయం అంటూ మంకుపట్టు పట్టుకునే మూర్ఖత్వం కేసీఆర్‌లో లేదు. ఇందుకు మనం అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. గతంలో ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు.. ఆర్టీసీని ఈ భూ ప్రపంచంలో ఎవరూ కాపాడలేరని చెప్పేశాడు. ఆర్టీసీని ప్రైవేటు చేస్తామన్నారు. ఆర్టీసీని ముక్కులు ముక్కలు చేస్తామన్నారు. మొత్తం మీద నెలన్నర రోజులు సమ్మె తర్వాత ఆర్టీసీ కార్మికులే దిగిరావాల్సి వచ్చింది.

ఆ తర్వాత మళ్లీ ఆర్టీసీ కార్మికులకు వాళ్లు కోరిన రీతిలోనే ఉద్యోగ ప్రయోజనాలు కల్పించి సంతోషపరిచారు. తాజాగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాల విషయంలోనూ అంతే జరిగింది. ఇంటర్ ఫస్టియర్‌లో సగానికి కంటే ఎక్కువ విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇష్యూ పెద్దదవుతుందని గ్రహించిన కేసీఆర్.. వెంటనే దిద్దుబాటకు నిర్ణయించుకున్నారు. ఫెయిలైన అందరినీ పాస్ చేయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అప్పటి వరకూ వచ్చిన వ్యతిరేకత నుంచి ఆయన తప్పించుకున్నారు.

ఇదిగో ఈ పట్టు విడుపు ఏపీ సీఎం జగన్‌ విషయంలో మాత్రం కనిపించడం లేదు. ఒక్కసారి జగన్ ఏదైనా నిర్ణయానికి వస్తే.. దాన్ని మార్చుకోవడమో.. పునరాలోచించడమో అన్న ఆలోచనే ఆయనలో కలగడం లేదు. మరి ఇలా తగ్గడం జగన్ ఎప్పుడు నేర్చుకుంటారో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: