ఇంకా తెగని ఏపీ ఉద్యోగుల పీఆర్సీ పంచాయతీ..?

ఏపీలో ఉద్యోగు పీఆర్సీ ఇతర సదుపాయాలపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన 71 డిమాండ్‌లపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చించారు. 71 డిమాండ్ ల పై రూ. 1600 కోట్ల జి పి ఎఫ్, ఏ పి జి ఎల్ ఐ, మెడికల్ బిల్లులు , రిటైర్డ్ ఎంప్లాయిస్ బెనిఫిట్స్ త్వరలోనే ఇస్తామని అధికారులు తెలిపినట్టు ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు తెలిపారు. మార్చ్ లోపు అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. పీఆర్సీకి సంబందించి అందరం ఒక్క మాటపై ఉన్నామని..  42 డిమాండ్ లు ఇప్పటికే  ఇచ్చామని.. ముఖ్యమంత్రి వద్దే ఫిట్మెంట్ పై తేల్చాలని కోరామని బండి శ్రీనివాసరావు అంటున్నారు. అధికారులు కమిటీ సిఫార్సులను అంగీకరించేది లేదని స్పష్టం చేశామన్న ఆయన.. వచ్చేవారం పీఆర్సీ పై సీఎంకు అన్ని వివరాలు చెపుతామని  సీఎస్ హామీ ఇచ్చారన్నారు.

అధికారులతో చర్చల్లో 40 అంశాల పై ఉద్యోగుల  డిమాండ్ లను ప్రభుత్వం దృష్టికి తెచ్చామని.. ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు తెలిపారు. ఇప్పుడు ఈ సమావేశం కాలయాపనే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రకరకాల వ్యాఖ్యలు చేస్తున్న కారణంగా ఉద్యోగుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని బొప్పరాజు అన్నారు. ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశం త్వరలోనే ఏర్పాటు చేయాలని కోరామన్న ఆయన.. నాలుగు రోజుల్లో సీఎం వద్ద ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారని వివరించారు. 14.29 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు చేస్తే 4 వేలు నుండి 10 వేలు మధ్య ఉద్యోగుల జీతాలు తగ్గుతాయన్న బొప్పరాజు.. 28 శాతం ఫిట్మెంట్ ఇస్తే 3100కోట్లు భారం, 44 శాతం ఫిట్మెంట్ ఇస్తే 8000కోట్లు మాత్రమే భారం పడుతుందని వివరించారు.

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఒకే కార్యాలయం లో పనిచేస్తున్న ప్రభుత్వ , కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఒకేసారి ప్రకటన చేయాలి అని కోరామన్నారు. 71 డిమాండ్ల పై 2 గంటల పాటు చర్చించామని.. క్రిస్టమస్ లోపు ఆర్థికపరమైన పెండింగ్ డిమాండ్ల ను పరిష్కరిస్తామని అధికారులు చెప్పారని వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఉద్యోగుల నుంచి మాకు చాలా ఒత్తిడి ఉందని.. అందుకే ఏపీజేఏసీ, ఏపీ జెఎసి అమరావతి ఉద్యోగ సంఘాల అంతర్గత  కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: