తేల్చుకో: టీడీపీ గట్టునుంటావా.. ఆంధ్రన్న.. వైసీపీ గట్టునుంటావా..?

ఏపీలో రాజకీయాలు పూర్తిగా వర్గరూపం సంతరించుకుంటున్నాయి. ఏపీలో ఏ ఇష్యూ మాట్లాడినా పూర్తిగా టీడీపీ, వైసీపీ ఇష్యూగా మారిపోతోంది. ఎవరైనా ఏపీ గురించి మాట్లాడితే.. వాళ్లు అటు వైసీపీ వైపయినా వకాల్తా పుచ్చుకోవాలి.. లేదంటే టీడీపీ వైపయినా మాట్లాడాలి.. అంతే తప్ప.. మధ్యే మార్గంగా ఉండే అవకాశం లేకుండా పోయింది.. ఏపీలో అయితే నువ్వు టీడీపీ వాదిగానైనా ఉండాలి.. లేదా వైసీపీ వాదిగానైనా ఉండాలి.. అంతే తప్ప.. ఈ రెండు కాకుండా వేరే మార్గం ఇంకా ఏమీ మిగలలేదు.

ఇది ఇటీవలి కాలంలో బాగా వచ్చిన దుర్మార్గమైన మార్పు.. టీడీపీ, వైసీపీకి మించి జనం ఏ విషయం గురించి కూడా ఆలోచించడం లేదు.. ఏ అంశం తీసుకున్నా అందులో ఈ రెండు పార్టీల కోణంలోనే చర్చ జరుగుతుంది తప్ప.. వాస్తవిక దృక్పథంతో సమాజంలో చర్చ జరగడం లేదు. ఎవరైనా మేధావి.. ఏదైనా అంశంలో జగన్ సర్కారును తప్పుబడితే..  ఆ మేధావిపై ఇక వైసీపీ సోషల్ మీడియా వాలిపోతుంది. అతడిని టీడీపీ వాదిగా ముద్ర వేస్తుంది.. సోషల్ మీడియాలో దాడి మొదలెట్టేస్తుంది.. ఇదే పరిస్థితి అటు టీడీపీలో కూడా ఉంది.

ఎవరైనా సరే వైసీపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూనో.. జగన్ పాలసీలను మెచ్చుకుంటూనో ఓ వ్యాఖ్య చేస్తే చాలు వెంటనే అతడిపై వైసీపీ పెయిడ్ బ్యాచ్ అంటూ ముద్ర వేసేయడం పరిపాటిగా మారింది. అసలు వైసీపీ, టీడీపీ కాకుండా కూడా ఇంకా ప్రజలు ఉంటారు.. వారు తమ అభిప్రాయాలు చెబుతుంటారు.. అన్న విషయాన్ని  ఈ  రెండు పార్టీలు ఏమాత్రం గమనంలోకి తీసుకోవడం లేదు. ఆ అంశాన్ని గుర్తించేందుకు కూడా ప్రయత్నించడం లేదు.

ఇందుకు తాజా ఉదాహరణ జస్టిస్‌ చంద్రు.. ఆయన ఏపీ ప్రభుత్వం విషయంలో హైకోర్టులో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి రెండు మాటలు మాట్లాడితే.. ఇక ఆయనపై ఆయన నేపథ్యం ఏంటో తెలిసి కూడా బురద జల్లే ప్రయత్నం టీడీపీ సోషల్ మీడియా చేస్తోంది. వైసీపీని ప్రశ్నించిన ఓ మేధావిని వైసీపీ సోషల్ మీడియా.. టీడీపీకు అమ్ముడుపోయారా అంటూ ప్రశ్నించే స్థాయికి ఏపీ రాజకీయాలు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఇది ఎంత మాత్రం మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: