డేంజరస్‌ డ్రాగన్: చైనా గుప్పిట్లో పాక్ మీడియా..?

మన పక్కలో బల్లెంలాంటి దేశం చైనా.. మన కంటే శక్తివంతమైన చైనా.. ఇప్పుడు ప్రపంచాన్నేతన గుప్పిట పెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రపంచ పెద్దన్న అయిన అమెరికాను సైతం ఢీకొడుతూ నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతోంది. అదే సమయంలో ఆసియాలో భౌగోళికంగా తన పొరుగున ఉన్న దేశాలపై పట్టు సాధిస్తోంది. పొరుగునే ఉంటూ కంటగింపుగా మారిన ఇండియాను కట్టడి చేసేందుకు అనేక వ్యూహాలు రచిస్తోంది. మొదటి నుంచి పాకిస్తాన్‌తో దోస్తీ కొనసాగిస్తున్న చైనా ఇప్పుడు పాకిస్తాన్ బలహీనతలను అడ్డుపెట్టుకుని ఏకంగా ఆ దేశ మీడియాను సైతం తన గుప్పిట్లో పెట్టుకుంటోంది.

పాకిస్థాన్‌ పాలకుల చైనాకు ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంబంధాలను వాడుకొని.. వాటిని అడ్డుపెట్టుకుని పాక్ మీడియా సంస్థలను చైనా తన గుప్పిట్లో పెట్టుకునేందు ప్రయత్నిస్తోంది. ఇదేదో చైనా అంటే పడని మన ఇండియా వంటి వాళ్లు పుట్టించిన కథనం కాదు..   ఈ విషయాన్నిఅమెరికాకు చెందిన ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్  బయటపెట్టింది. అయితే పాక్ మీడియాను గుప్పిట్లో పెట్టుకుని చైనా ఏం చేస్తుంది.. దీని వల్ల చైనా వంటి దేశానికి ఏం లాభం అని ఆలోచిస్తున్నారా.. పాక్ మీడియాను తన కంట్రోల్‌లో పెట్టుకోవడం ద్వారా పశ్చిమ దేశాల ప్రచారాన్ని అడ్డుకోవచ్చన్నది చైనా ప్లాన్.

పాకిస్తాన్‌లోని ప్రజల అభిప్రాయాలే కాకుండా అంతర్జాతీయంగా కూడా చైనా అనుకూల ప్రచారం కోసం పాక్ మీడియాను చైనా బాగా వాడుకుంటోందట. సొంతంగా చైనా మీడియా చెబితే నమ్మే అవకాశాలు త‌క్కువ అంటే.. పాక్ మీడియా ద్వారా తన అనుకూల ప్రచారం చేయించుకోవాలని చైనా డిసైడ్ అయ్యిందన్నమాట. అంతే కాదు.. పాక్, చైనా రెండు కూడా ఇరుదేశాలకు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాయట.

గత సెప్టెంబర్‌లో పాక్‌-చైనా మీడియా ఫోరం సదస్సు జరిగింది. ఇందులో ఈ సహకారంపై పాక్, చైనా బాగా చర్చించాయి. దీనికోసం ప్రత్యేకంగా చైనా-పాకిస్థాన్‌ మీడియా కారిడార్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించాయి. అంతే కాదు.. పాకిస్థాన్‌ మీడియాపై చైనా ఓ పర్యవేక్షణ సంస్థను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందట. మొత్తానికి పాక్ మీడియా క్రమంగా చైనా చేతుల్లోకి వెళ్లిపోతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: