కేసీఆర్ క్రెడిట్‌ గేమ్స్‌ - రేవంత్ ఊరుకుంటాడా..?

సాగు చట్టాలపై ఎట్టకేలకు కేంద్రం వెనుక్కుతగ్గింది. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని సాక్షాత్తూ మోడీ ప్రకటించారు. దీంతో దీన్ని రైతుల విజయంగా వర్ణిస్తూ ప్రశంసలు వెలువడ్డాయి. నిజంగానే రైతులు దాదాపు ఏడాది పాటు అలుపెరగని పోరాటం చేశారని చెప్పాలి. అయితే.. ఈ మోడీ నిర్ణయాన్ని కూడా టీఆర్ఎస్ శ్రేణులు కాస్త తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. కేసీఆర్ ధర్నా చేయడం వల్లనే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు చెబుతున్నారు.

నిజమే.. కేసీఆర్‌ సాగు చట్టాలపై ఇటీవల మాట్లాడిన మాట వాస్తవమే.. డిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలకు మద్దతుగా తాము దేశ్యాప్తంగా పోరాటం చేస్తామన్న మాటా నిజమే.. సాగు రైతులను విమర్శించిన మాటా నిజమే.. త్వరలో ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తామన్న మాటా నిజమే.. కానీ.. కేవలం కేసీఆర్ హెచ్చరికలతోనే మోడీ దిగివచ్చారా.. అంటే ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. వాస్తవానికి మోడీ ఈ నిర్ణయం రైతులపై ప్రేమతో తీసుకున్నదేమీ కాదు. యూపీ, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో బీజేపీకి ఎదురుగాలి వీయకుండా తీసుకున్న నిర్ణయంగానే చూడాలి.

అందుకే.. దీన్ని టీఆర్ఎస్, కేసీఆర్ విజయంగా వర్ణించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబడుతున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికి పైగా పోరాడారని.. రైతుల హక్కులను అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టాలని చూస్తే రైతులు ఎదురు తిరిగారని రేవంత్‌ అంటున్నారు. రైతుల విజయాన్ని కేసీఆర్‌ గొప్పగా తెరాస నేతలు చెప్పడం సిగ్గు చేటన్నారు రేవంత్‌ రెడ్డి. సాగు చట్టాలకు ‌వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కోరినా కేసీఆర్ పట్టించుకోలేదని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

కేసీఆర్ రైతుల ఉద్యమానికి ఏ ఒక్కరోజు కూడా మద్దతు పలకలేదని.. అలాంటి కేసీఆర్ ఒక్కపూట చేసిన ధర్నాకే మోదీ భయ పడ్డారా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. అదే నిజమైతే..  మరి ధాన్యం విషయంలో కేంద్రం ఎందుకు దిగిరావట్లేదుని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఎప్పుడూ మోదీకి వ్యతిరేకంగా పని చేయలేదని రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. అనేక బిల్లుల ఆమోదం విషయంలో కేసీఆర్ మోడీకి సహకరించారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: