జగన్.. నీ సర్కారు ఈ లోపం అధిగమించాల్సిందే..?

ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి సీఎం అయ్యి రెండున్నరేళ్లు దాటుతోంది. అంటే దాదాపు సగం పాలనా కాలం పూర్తయింది. మరి ఈ సగం పాలనలో జగన్ మార్క్ ఎలా ఉంది. జనం ఏమనుకుంటున్నారు అనే విషయాలు ఆసక్తికరం.. ఒక్కసారి పాలనా తీరును వెనక్కి తిరిగి చూసుకుని.. బేరీజు వేసుకుని లోటుపాటులు సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా జగన్ సర్కారు పని తీరును బేరీజు వేస్తే.. సంక్షేమ రంగంలో మంచి మార్కులే పడతాయి. బహుశ దేశంలో ఏ సర్కారు అందివ్వని స్థాయిలో జగన్ సర్కారు సంక్షేమం అందిస్తోంది.

అంత వరకూ ఓకే.. కానీ.. జగన్ సర్కారు పారిశ్రామిక రంగంలో చెప్పుకోదగ్గ విజయాలు ఏమాత్రం నమోదు చేయలేదు.. కొత్త పరిశ్రమల రాక సంగతి పక్కకు పెట్టి.. గతంలో వచ్చినవి కూడా వెనక్కు మళ్లుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. తిరుపతి సమీపంలో రిలయన్స్ తలపెట్టిన పారిశ్రామిక పార్కు ప్రతిపాదన వెనక్కు వెళ్లింది. విశాఖలోని మెడ్ టెక్‌ జోన్‌ పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. ఉన్న పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో జగన్ సర్కారు పారిశ్రామిక రంగంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకే తాజాగా పరిశ్రమల పెట్టుబడుల బోర్డుతో సమావేశమైన జగన్.. రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమల ఏర్పాటుకు పచ్చజెండా ఊపేశారు. రాష్ట్రంలో రూ.2,134 కోట్ల పెట్టుబడులతో ఈ  ఐదు పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. ఆ 5 పరిశ్రమల ద్వారా 7,683 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలకు అవకాశం కలుగుతోంది. పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌ లిమిటెడ్‌ ఏర్పాటు కాబోతోంది.

అలాగే.. బద్వేలులో ప్లైవుడ్‌ తయారీ పరిశ్రమ, తూర్పుగోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ తయారీ పరిశ్రమ, కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల  తయారీ పరిశ్రమ, ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ పరిశ్రమ రాబోతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రకటనలు బాగానే ఉంటాయి.. కానీ ఆచరణలో ఎంత వరకూ అమలవుతాయనేదే కీలకం. ఇకనైనా జగన్ సర్కారు మేలుకుని పరిశ్రమలపై ఆచరణాత్మక ప్రణాళిక రూపొందించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: