అఖండ 2 గ‌ర‌గ త్రినాథ్‌ రివ్యూ: స‌నాత‌న ధ‌ర్మ భ‌క్తుల‌కు రుద్ర తాండ‌వం

RAMAKRISHNA S.S.
యువరత్న నంద‌మూరి బాల‌కృష్ణ - దర్శక ఘనాపాటి(ఒకప్పుడు.. ఇప్పుడు కాదులెండి)బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్ అంటేనే లాజిక్కులకు అందని ఓ మ్యాజిక్‌. ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టిన కాంబో ఇది. వీరిద్ద‌రి నుంచి మ‌రో సినిమా వ‌స్తోందంటే అంచ‌నాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ తాండవం హైప్ చూస్తేనే అర్థ‌మైపోతోంది. డిసెంబ‌రు 5న రావాల్సిన సినిమా అనివార్య కారణాల వ‌ల్ల వారం వాయిదా ప‌డినా  క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. రిలీజ్‌కు ఒక్క రోజు ముందు విడుద‌ల చేసిన టీజ‌ర్ మ‌రింత క్రేజీనెస్ పెంచింది.. మరి ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అన్నది ఈ రివ్యూ లో చూద్దాం..


ముందే చెప్పినట్లుగా లాజిక్కులతో చూసే సినిమా కాదిది. పూర్తిగా బాలయ్య బాబు,బోయపాటి శ్రీను మేజిక్ మీద ఆధారపడిన సినిమా. అఖండకు కొనసాగింపుగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ కథను అల్లుకున్నాడు. సనాతన ధర్మం, బయోవార్‌, దైవత్వం ఇలా అన్ని కోణాల్లో ఆసక్తికరమైన సన్నివేశాలతో  ఓ కమర్షియల్‌ సినిమాకు  కావాల్సిన హంగులన్నీ సమకూర్చుకున్నాడు. ముఖ్యంగా ఎక్కడా కూడా సినిమాపై ఆసక్తి తగ్గకుండా ప్రేక్షకులకు, బాలకృష్ణ అభిమానులకు హై ఇచ్చే సన్నివేశాలను రాసుకున్నాడు. మూవీ ప్రారంభమైన అరగంట వరకూ బాగానే ఉందనిపించినా, సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు అందేలా సాగుతాయి. దైవ శక్తితో కథను ప్రారంభించిన దర్శకుడు చివరకు దేశభక్తితో ముగించాడు. మధ్యలో క్షుద్ర శక్తులు కూడా ఉన్నాయి అనుకోండి. అక్కడక్కడా సనాతన ధర్మం గురించి ప్రేక్షకుడికి క్లాసులు పీకుతున్నట్లుగా ఉందే తప్ప, ఎక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదు.


దీనికి తోడు యాక్షన్ సీక్వెన్స్లు కూడా చాలా రొటీన్ గా ఉండటంతో స్క్రీన్ ప్లే మొత్తం సాగతీతగా అనిపిస్తుంది.సెకండాఫ్‌లో క‌థ ప‌ట్టు త‌ప్పి క‌థ‌నం మ‌రింత స్లో అయ్యింది. ఆది పినిశెట్టి క్యారెక్ట‌ర్ బ‌లంగా తీర్చిదిద్దినా స‌రిగా వాడుకోలేక‌పోయారనిపించింది. స‌రైన విల‌నిజం లేక సీన్లు తేలిపోయాయి..సెకండాఫ్‌ కొంచెం నిడివి ఎక్కువగా అనిపించినా, ఎక్కడా కూడా ఆడియన్స్‌కు బోర్‌ కొట్టకుండా దర్శకుడు బోయపాటి శ్రీను ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా రాసుకోవడంతో పాటు ఆయన ప్రజెంట్‌ చేసిన తీరు కామన్ ఆడియన్ ను కూడా ఆకట్టుకుంటుంది.. ఐతే యాక్షన్ సీన్లు పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ, చాలా చోట్ల సమస్యలు త్రిశూలంతోనే పరిష్కారమవుతుండటం విడ్డూరం అనిపిస్తుంది.ఇక నటీనటుల విషయానికొస్తే అఖండగా నందమూరి బాలకృష్ణ నటన ఎంతో ప్రశంసనీయం. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లుగా ఉంటుంది. అసలు ఆ పాత్రలో బాలకృష్ణను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేం.


సంయుక్త మీనన్‌ ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో తన పరిధి మేరకు నటించింది. బాలకృష్ణ కూతురు పాత్రలో హర్షాలి మల్హోత్రా పాత్రలో ఓ తెలుగమ్మాయిని తీసుకుంటే, ఆ పాత్ర ఇంకా బలంగా ఉండేదేమో.చైనా జనరల్ గా సంగయ్ షెల్జిం తన ఉనికిని చాటుకున్నాడు. కల్కిలో కనిపించిన శాశ్వత చటర్జీ కూడా ఓకే.ప్రధానమంత్రిగా సర్వదమన్ బెనర్జీ, ఆఫీసర్లుగా పూర్ణ మొదలైనవాళ్లు తమ పాత్రల పరిధి మేర నటించారు.టెక్నికల్ గా తీసుకుంటే ఈ చిత్రానికి అసలు ఆయువుపట్టు ఖచ్చితంగా తమన్ సంగీతమే. బిజిఎం స్కోర్ చాలా హెవీగా ఉంది.తమన్ తనదైన సౌండింగ్ తో ఓ ఆట ఆడుకొన్నాడు. అఖండ ఎప్పుడొచ్చినా.. పూన‌కం వ‌చ్చిన‌ట్టు బీజిఎమ్స్ ఇచ్చేశాడు.


నన్నడిగితే తమన్ అసలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద పెట్టిన శ్రద్ధ పాటల మీద పెట్టలేదు.అదే విధంగా సి రామ్ ప్రసాద్, సంతోష్ డి డెటాకే సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది.నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. చివరగా బాలయ్య బాబు అభిమానులకు, సనాతన ధర్మ భక్తులకు ఈ అఖండ తాండవం నిజంగా రుద్రతాండవం లా కనిపిస్తుంది కానీ, సామాన్య ప్రేక్షకులకు మాత్రం భావోద్వేగాలు లేని మామూలు తమన్ తాండవమే..!

- త్రినాథ్ రావు గరగ
సీనియర్ జర్నలిస్ట్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: