2024 ఎన్నికల్లో మోడీని ఆ రాముడు కాపాడతాడా ?

మరో రెండున్నరేళ్లలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు పార్టీని కేవలం తన సొంత బలంతో నెగ్గించిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పార్టీని విజయం వైపు నడిపిస్తాడా అన్న సందేహాలు పార్టీలోనే  వస్తున్నాయి. కొందరు నాయకులు దీనిపై బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అనేక రూపాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జై శ్రీరామ్ నినాదంతో ఎన్నికల్లో నెగ్గేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోందన్న వాదన వినిపిస్తోంది.

ఇప్పుడు అయోధ్యలో శరవేగంగా జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులు కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధారణ ఎన్నికల కంటే ముందే పూర్తి కానుందని తాజాగా ఆలయ ట్రస్ట్ వర్గాలు చెప్పాయి. మరో రెండేళ్లలో అంటే 2023  డిసెంబర్ నాటికి భక్తుల కోసం ఆలయ తలుపులు తెరుచుకుంటాయట. ఈ విషయాన్ని  ట్రస్ట్ జనరల్  సెక్రెటరీ చంపత్ రాయ్  వివరించారు.

అంటే.. 2024 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామమందిర నిర్మాణం  పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నమాట. ప్రస్తుతం అయోధ్యలో ఆలయ నిర్మాణ పనలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆలయ శంకుస్థాపన మొదటి దశ పనులు ఈ సెప్టెంబర్ లో పూర్తి అయ్యాయి. ఇక ఇప్పుడు రెండో దశ పనులు  ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అయోధ్యలో కాంక్రీట్ పనులు జోరుగా జరుగుతున్నాయి. పగలూ, రాత్రి తేడా లేకుండా వేగంగా పనులు చేయిస్తున్నారు.

ఎలాగైనా 2023 డిసెంబర్  కల్లా ఆలయం ప్రారంభించి దాన్ని 2024 ఎన్నికల ముందు బాగా ప్రచారం చేసుకోవాలన్న వ్యూహంలో బీజేపీ అగ్రనేతలు ఉన్నట్టు కనిపిస్తోంది. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జై శ్రీరామ్‌ నినాదం వర్కవుట్ అవుతుందా.. లేదా అన్నది చూడాలి. మరి జనం అయోధ్యకు ఓటేస్తారా.. మోడీ పాలనను బేరీజు వేసుకుని ఓటేస్తారా అన్నది ఆలోచించాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: