చంద్రబాబుకు ఏమైంది.. ఆ అలవాటు మానేశారు..?

చంద్రబాబుకు ఏమైంది.. ఆయన ఎందుకు ఇలా మారిపోయారు.. అన్న అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. ఇంతకీ ఆయనకు ఏమైందన్న అనుమానం ఎందుకు వచ్చిందంటే.. ఇటీవల ఆయనలో చాలా మార్పు వచ్చింది. గతంలో చంద్రబాబు మీడియాలో తరచూ కనిపించేవారు.. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ఆయన నిత్యం మీడియాలో కనిపించేవారు. కనీసం అనుకూల మీడియాలోనైనా కనిపించేవారు. ఇక ఆయన ప్రెస్ మీట్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గంటల తరబడి సాగే ఆయన ప్రెస్ మీట్లను భరించడానికి విలేఖర్లు జండూబామ్‌లు జేబుల్లో వేసుకుని వెళ్లేవారన్న జోకులున్నాయి కూడా.

నిత్యం మీడియాలో ఉండకపోతే.. చంద్రబాబుకు ఉక్కపోతగా ఉంటుంది. ఆయనకే కాదు.. ఆయన అనుకూల మీడియా కూడా ఆయన వార్తలు ఇవ్వకపోతే చాలా లోటుగా ఫీల్ అయ్యేవి. మరి అలాంటిది కొన్ని నెలలుగా చంద్రబాబు పెద్దగా మీడియాలో కనిపించడం లేదు. ఆయన ప్రెస్ మీట్లు కూడా బాగా తగ్గిపోయాయి.. ఆయన బయట కనిపించడమే తగ్గించేశారు. ఎప్పుడో చాలా అరుదుగా ఆయన బయటకనిపిస్తున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు. మరి ఇంత మార్పు చంద్రబాబులో ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు మీడియా సర్కిళ్లో చర్చనీయాంశమైంది.

అయితే.. చంద్రబాబు.. ఆయన అనుకూల మీడియా చేస్తున్న అతి ప్రచారాలే కొంప ముంచుతున్నాయన్న చర్చ కూడా టీడీపీలోని కొన్ని వర్గాల్లో ఉంది. అందుకే అతి తగ్గించుకోవాలని కొందరు శ్రేయోభిలాషులు చంద్రబాబుకు సూచించారని.. దాన్ని ఆయన కూడా అంగీకరించి ఫాలో అవుతున్నారని చెబుతున్నారు. దీనికి తోడు నిత్యం మీడియాలో ఉండటం వల్ల కూడా పెద్దగా లాభం లేదని.. అవసరమైనప్పుడు వస్తే చాలని చంద్రబాబు కూడా భావిస్తున్నట్టున్నారు.

ఇదే ఒరవడి కొనసాగితే.. అది చంద్రబాబుకు మేలు చేసేదే అవుతుంది. మీడియా మేనేజర్ అన్న ముద్రను కూడా చంద్రబాబు తొలగించుకున్నట్టవుతుంది. నిజమైన సమస్యల సమయంలో ఆయన చేసే ప్రచారం జనంలోకి వెళ్తుంది. మరి చంద్రబాబు ఇలా ఎన్నాళ్లు నిగ్రహం పాటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: