టెన్నిస్‌లో నెంబర్‌వన్ ఎవరో...?

ముగ్గురు దిగ్గజాలు.. 18 సంవత్సరాలు.. 60 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు. టెన్నిస్‌ చరిత్రలో ఇదొక అరుదైన శకం. ఒకే సమయంలో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు టెన్నిస్‌లో ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ కోసం పోటీపడుతున్నారు. స్విస్‌ యోధుడు రోజర్‌ ఫెదరర్‌, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌లలో ఎవరు అత్యుత్తమనే చర్చకు ఇవాళ్టి మ్యాచ్‌తోనే ముగింపు పడే ఛాన్స్‌ కనిపిస్తోంది. యూఎస్‌ ఓపెన్‌ మెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు జకోవిచ్‌ ఫైనల్‌కు చేరడంతో టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాడు ఎవరనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్‌ విజయాలతో సమవుజ్జీలుగా ఉన్నారు. గత 18 ఏళ్లలో 70 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు జరుగగా.. ఈ ముగ్గురే 60 గ్రాండ్‌స్లామ్‌ విజయాలను అందుకున్నారు.

తన కెరీర్‌లో ఇప్పటివరకు 20 గ్రాండ్స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకున్న జకో.. ఇవాళ జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో విక్టరి కొట్టి టెన్నిస్‌ రికార్డులను తిరగరాయాలని పట్టుదలగా ఉన్నాడు. గతేడాది వరకు ఫెదరర్ రికార్డును నాదల్ తిరగరాస్తాడని టెన్నిస్‌ అభిమానులు ఆశించారు. కానీ, 34ఏళ్ల జకో ఈ ఏడాది ఆడిన మూడు గ్రాండ్‌స్లామ్‌లలోనూ టైటిల్‌ గెలిచి ఫెదరర్‌, నాదల్‌ సరసన చేరి అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఇక జకో జోరు చూస్తుంటే వీళ్లిద్దరినీ దాటేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే 40 ఏళ్లకు చేరువగా వచ్చిన ఫెదరర్, బరిలో దిగి చాలా నెలలు అయింది. అతను గ్రాండ్ స్లామ్ గెలిచి మూడేళ్లయింది. 35 ఏళ్ల నాదల్‌ కూడా ఫ్రెంచ్ ఓపెన్‌లో తప్ప పెద్దగా రాణించలేకపోతున్నాడు. కానీ, అన్ని కోర్టుల్లోనూ స్థిరంగా ఆడుతూ దూసుకెళ్తున్నాడు జకో.

జకోవిచ్‌ ఆడిన చివరి ఎనిమిది గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సెర్బియా యోధుడు ఏకంగా ఏడు టైటిళ్లను గెలుచుకున్నాడు. జకోవిచ్‌ సాధించిన 20 గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో 8 టైటిళ్లు అతడు మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన తర్వాతే సాధించాడు. ఇక ఇవాళ జరిగే యుఎస్‌ ఓపెన్‌ను సొంతం చేసుకుంటే.. క్యాలెండర్‌ స్లామ్‌ను పూర్తి చేసిన మూడో ఆటగాడిగా జకో చరిత్ర సృష్టిస్తాడు. 1937లో డాన్‌ బుడ్జె , 1962, 69లో లావెర్‌ క్యాలెండర్‌ స్లామ్‌లను సాధించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ రికార్డు నెలకొల్పే అవకాశం జకోవిచ్‌ ముందుంది.

అటు ఫెదరర్‌, నాదల్‌ గ్రాండ్‌స్లామ్‌ రేసు నుంచి తప్పుకున్నట్టే భావించవచ్చు. ఫిట్‌నెస్‌, వయసు బట్టి చూస్తే మునుపటి స్థాయిలో రాణించే అవకాశం లేదు. ఆ ఇద్దరి కంటే చిన్నవాడైన జకోవిచ్‌.. గ్రాండ్‌స్లామ్‌ రేసులో ఇప్పటికీ మొనగాడే. అతడు కనీసం మరో ఐదు గ్రాండ్‌స్లామ్‌ విజయాలు సాధించే అవకాశాలున్నాయిని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. దీంతో టెన్నిస్‌ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్‌ స్లామ్‌లు గెల్చుకున్న రికార్డును జకోవిచ్‌ సాధించడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఇవాళ జరిగే ఫైనల్‌తోనే జకో ఈ ఫీట్‌ సాధించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: