రాజకీయం - పదజాలం : స్వర్ణ యుగం పై పేటెంట్ ఎవరికి?
రాజకీయ పదజాలం ఎలా ఉన్నా, అది వాడే తీరే అత్యంత ఆసక్తికి దోహదం. రాజకీయ పదజాలం ఎలా ఉన్నా ఎవరిని మెప్పునకు అది మొగ్గు చూపుతుందో అన్నది అవసరం. పొగడ్త ఎంత ఆనందాన్ని ఇస్తుంది అన్నది ఒక్కోసారి ప్రామాణికం అవుతుంది. ఎంత టి విధ్వంసానికి కారణం అవుతుంది అన్నది ఒక్కోసారి సంబంధిత సందర్భాలను అనుసరించి ఉంటుంది. రాజకీయంలో గెలిచే వారు ఓడేవారు ప్రశంసలపైనా, పొగడ్తలపైనా ఎక్కువగా ఆధారపడి ఉంటారు. ఓడిపోతే నైతిక విజయం అంటారు, గెలిస్తే ఇది ప్రజా విజయం అని విర్రవీగుతారు. మరి! వాస్తవం ఏంటన్నది కాలమే తేల్చాలి. తమ పాలన రామ రాజ్యం అని చెప్పడం సులువు..అదే సమయంలో అందుకు తగ్గ పనులు చేయడమే కష్టం. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్ర పాలనతో ఎంతో పేరు తెచ్చుకు న్నారు ఆనాటి నాయకులు. నాటి రోజులకు ఓ పోలిక తెచ్చి వైసీపీ, కాంగ్రెస్ కూడా మాట్లాడుతుంటుంది. తమ ప్రియతమ నాయకులు వైఎస్సార్ పాలన స్వర్ణ యుగం అని అంటుంటారు. వాస్తవానికి రాయల కాలాన్ని స్వర్ణయుగం అని వర్ణిస్తారు. బహుశా! ఇలాంటి పోలికే తమ నేతకూ వర్తిస్తుందని అని ఉంటారు. బాగుంది కొన్ని పథకాల విషయమై రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు ఎంతో పేరు తెచ్చాయి.
స్వర్ణ యుగమా కాదా అన్నది తరువాత చూద్దాం. అదే పదాన్ని కాంగ్రెస్ వాడాక నాన్నను స్మరిస్తూ రాజన్న రాజ్యం స్వర్ణ యుగం అని జగన్, షర్మిల తరుచూ అంటుంటారు. కాంగ్రెస్ కన్నా ఎక్కువగా రాజన్న సెంటిమెంట్ ను నమ్ముకున్న ఆయన కుమారుడు జగన్, కూతురు షర్మిల రెండు వేర్వేరు పార్టీలు పెట్టిన సందర్భంలో ఇవే వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పుడెప్పుడో ఎన్టీఆర్ పాలన చేసే రోజుల్లో అంటే 90ల కాలంలో రామన్న రాజ్యం ఇది సంక్షేమ రాజ్యం ఇది అని ఎన్టీఆర్ ప్రచారంలోకి తెచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు (టీడీపీ ఏపీ వ్యవహారాలను చూస్తున్న వ్యక్తి, ఆ పార్టీ అధ్యక్షులు) తమది స్వర్ణ యుగమని, తమ పాలన అంతా స్వర్ణ యుగాన్ని తలపించే సాగిందని చెప్పారు ఇవాళ. గత ప్రభుత్వం హయాంలో తాము రైతుకు ఎంతో మేలు చేశామని చెబుతూ, తమ పరిధిలో ఆనాడు చేసిన సంక్షేమ పాలన అంతా స్వర్ణ యుగమేనని అన్నారు అచ్చెన్నాయుడు ఇవాళ.
కేంద్రంగా టీడీపీ రైతు విభాగంకు సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆనాడు చంద్రబాబు చేసిందంతా స్వర్ణ యుగాన్ని తలపించిందేనా? ఇంతకూ ఈ పదానికి సంబంధిత వాడుకకూ పార్టీల వైఖరికీ ఏమయినా పొంతన ఉందా? అన్నదే సిసలు సందేహం. బీజేపీ కూడా అప్పుడెప్పుడో దేశం వెలిగిపోతుంది అని చెప్పి తరువాత విమర్శల పాలైంది. ఇండియా షైనింగ్ .. అని వాజ్ పేయి చెప్పారు. మోడీ కూడా దేశవాళీ తయారీలో భాగంగా మేడిన్ ఇండియా మేకిన్ ఇండియా నినాదాలు తెచ్చి విమర్శలకు తావిచ్చారు. ఇదే సందర్భంలో మరో నేత గుర్తుకు వస్తున్నారు. ఆయనే పొరుగు సీఎం స్టాలిన్ . ఉదయించే సూర్యుడు మాదిరిగా తాను పనిచేస్తానని స్టాలిన్ చెప్పారా? తెలియదు చెబితే సంతోషమే! ఏదేమైనప్పటికీ నాయకులు పదాలను వాడే క్రమంలో రాజకీయ ఆసక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అనేందుకు ఇవాళ అచ్చెన్న వ్యాఖ్యలే తార్కాణం. మాసివ్ ఎపీల్ అన్నది కీలకం..అచ్చెన్న ఆ ప్రకారం స్వర్ణ యుగం అన్న పదం వాడారు..అని కాసేపు అనుకుందాం. టీడీపీది స్వర్ణ యుగమా.. లేదా వైసీపీది స్వర్ణ యుగమా అన్నది కాలమే తేల్చాలి రానున్న కాలాన!