విశాఖను పక్కకు పెట్టి.. కర్నూలుకు తరలిస్తున్నజగన్..?

మూడు రాజధానులు.. ఇది జగన్ బుర్రలోనే వచ్చిన ఓ ఐడియా.. ఇప్పటివరకూ దేశంలో ఓ రాష్ట్రంలోనూ లేనట్టు ఏపీలో మూడు రాజధానులు తీసుకురావాలని జగన్ కలలు కన్నారు. అయితే ఈ మూడురాజధానుల నిర్ణయం కేవలం.. అమరావతిని అడ్డుకోవడానికే అన్న విమర్శలు ఉన్నాయి. అమరావతిని ఎంత అభివృద్ధి చేసినా ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు ఖాతాలోకే వెళ్తుందని.. అందుకే.. అమరావతిని పూర్తిగా అడ్డుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరిగింది.

వాస్తవం ఏదైనా.. జగన్ సర్కారు కొంత కసరత్తు తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా చేసుకుంటే.. పెద్దగా రాజధాని కోసం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదన్నది జగన్ ఆలోచనగా చెబుతారు. ఎలాగూ జగన్ ప్రయారిటీ సంక్షేమం.. రాజధాని కాదు. అలాంటప్పుడు రాజధాని కోసం భారీగా ఖర్చు చేయాలని జగన్ ఏమాత్రం భావించడం లేదు. అయితే.. విశాఖను రాజధానిగా చేయాలన్న జగన్ కోరిక కోర్టుల్లో విచారణ కారణంగా పెండింగ్‌పడింది.

ఇక ఆ మూడు రాజధానుల నిర్ణయం ఎప్పుడు తేలుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే ఇదే సమయంలో జగన్ మాత్రం విశాఖ సంగతి ఎలా ఉన్నా కర్నూలును మాత్రం న్యాయరాజధాని చేయాలని ప్రయత్నిస్తున్నారు. న్యాయ రాజధాని కావాలంటే కోర్టు తీర్పులు రావాల్సి ఉన్నా.. హైకోర్టు కాకుండా మిగిలిన న్యాయ వ్యవస్థలను కర్నూలు తరలించేందుకు జగన్ సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ ఆలోచన అమలులో విజయం కూడా సాధించింది. విచిత్రం ఏంటంటే.. కర్నూలుకు కొన్నివిభాగాలు తరలిపోతుంటే కోర్టులు ఏమాత్రం అడ్డుచెప్పలేదు కూడా.

తాజాగా ఏపీ హెచ్చార్సీ ఆఫీసును కర్నూలుకు తరలించారు. ఆ తర్వాత లోకాయుక్తను కూడా కర్నూలులోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక ఇప్పుడు.. వక్ఫ్ బోర్డును కూడా జగన్ కర్నూలుకు తరలించాలని భావిస్తున్నారు. ఇలా మొత్తానికి కర్నూలుకు న్యాయ రాజధాని కళ తెచ్చేందుకు జగన్ తగిన చర్యలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: