2024లో ఏపీలో బీజేపీకి ఈ చెత్త‌ రికార్డు ఖాయ‌మే...!

VUYYURU SUBHASH
విశాఖలోనే పుట్టి పెరిగిన బీజేపీ నాయకుడు పీవీఎన్ మాధవ్ కి ఇపుడు విశాఖ ఉక్కు సెగ గట్టిగానే తగులుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సమర్ధిస్తూ ఆయన గట్టిగానే ప్రకటనలు చేస్తున్నారు. దాంతో ఆగ్రహించిన ఉక్కు కార్మిక సంఘాల నేతలు మాధవ్ ని టార్గెట్ చేశాయి. మాధవ్ తన పదవికి రాజీనామా చేయాలని వారు కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మాధవ్ ఈ మధ్యన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం పాలసీగా  ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించడం అంటూ మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అయినా కూడా కార్మికుల ప్రయోజనాలకు ఎక్కడా  ఇబ్బంది కలగదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

అయితే మాధవ్ మాటలు ఉక్కు ఉద్యమంలో మంటలే రేపాయి. అసలే ఆరు నెలలుగా పోరాటం చేస్తూంటే కనీసం పరామర్శించడానికి కూడా తీరిక లేని బీజేపీ నాయకులు తీరి కూర్చుని ప్రైవేట్ కు సపోర్ట్ చేయడం ఏంటని వారు మండిపడుతున్నారు. మా ఉద్యోగాల మాట పక్కన పెడితే ముందు మీరు ఎమ్మెల్సీ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో మాధవ్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

అంతకు ముందు కూడా మాధవ్ ఉక్కు ప్రైవేటీకరణ మీద ఇలాగే మాట్లాడారని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే అసలే విశాఖలో బీజేపీ ఉనికి పోరాటం చేస్తోంది. కాస్తో కూస్తో బలం ఉందనుకున్న చోట ఉక్కు సెగ కనుక తగిలితే మొత్తానికి మొత్తం పోతుందని కమలనాధులు కలవరపడుతున్నారు. అంతకు ముందు జీవీఎంసీలో నలుగురు కార్పోరేటర్లను బీజేపీ గెలుచుకుంది. ఈసారి మాత్రం ఒక్కరే గెలిచారు.

ఇక 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తే టోటల్ గా  డిపాజిట్లు కూడా బీజేపీకి పోయాయి. ఇపుడు ఉక్కు సెగతో కమలం పార్టీకి కష్టాలు పొంచి ఉన్నాయని అంటున్నారు. మరో వైపు కేంద్రంలో బీజేపీకి కూడా ఆదరణ తగ్గుతోంది. ఏపీలో టీడీపీతో పొత్తు కనుక లేకపోతే ఈసారి కూడా నోటా కంటే తక్కువ ఓట్లు వ‌చ్చే చెత్త రికార్డు ఖాయంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: