కృష్ణా వివాదం: జగన్, కేసీఆర్ ఎవరు కరెక్ట్..?
ఇక కేసీఆర్, జగన్.. ఈ ఇద్దరి వాదనలో ఎవరిది కరెక్ట్ అంటే స్పష్టంగా చెప్పలేం.. ఏ రాష్ట్రం సమస్యలు వారికి ఉన్నాయి. ఎవరి కోణంలో వారు ఆలోచిస్తున్నారు. ఎవరికి అనుకూలమైన వాదనలు వారు వినిపిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న నిబంధనల గురించే ప్రస్తావిస్తున్నారు. ఈ జల వివాదంలో సహజంగా పై రాష్ట్రం కావడం వల్ల తెలంగాణదే పైచేయిగా ఉంటోంది. అయితే రాయలసీమ ఎత్తిపోతల అక్రమమని తెలంగాణ వాదిస్తోంది. ఇక్కడ నిబంధన ప్రకారం చూస్తే తెలంగాణ వాదన కరెక్టని చెప్పాలి. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం కృష్ణా బేసిన్ కిందకు రాదు.
నదీ జలాల విషయంలో బేసిన్ అవసరాలు తీరిన తర్వాతే బేసిన్ అవతలకు నీళ్లు తీసుకెళ్లాలనే నిబంధన ఉంది. అయితే ఇక్కడ నిబంధనల కంటే వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణా డెల్టా కృష్ణా బేసిన్‌కు చెందిందే అయినా.. దానికి నీటి అవసరాల కోసం ఇతర మార్గాలు ఉన్నాయి. కానీ రాయలసీమకు శ్రీశైలం తప్ప ఇతర మార్గాలు లేవు. మరి శ్రీశైలం నుంచి నీటిని తోడుకోవాలంటే.. కనీసం 854 అడుగులు ఉండాలి. అప్పుడే గ్రావిటీ ద్వారా నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు వెళ్తాయి.
అయితే శ్రీశైలంలో 854 అడుగులపైన నీళ్లు ఉండాలంటే వరదల సమయలోనే సాధ్యం. వరదల సమయం అతి కొద్దికాలమే ఉంటుంది. మరి ఆ స్వల్ప కాలంలోనే నీళ్లు తరలించుకు పోవాలంటే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకోవాల్సిందే.. ఇప్పుడు జగన్ సర్కారు చేస్తున్నది అదే. సో.. నిబంధనల ప్రకారం చూస్తే తెలంగాణ రైటు.. వాస్తవాలు, అవసరాల ప్రకారం చూస్తే జగన్ చేస్తున్నది రైటు. అందుకే ఈ సమస్యను ఇద్దరు సీఎంలు కూర్చుని చర్చించుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది.