సిద్దూను సెట్ చేస్తారా.. పంజాబ్‌ పై హస్తం పట్టు కొనసాగుతుందా..?

వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పంజాబ్‌ ఒకటి.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న అతి తక్కువ రాష్ట్రాల్లో పంజాబ్‌ ఒకటి. ఇక్కడ అమరీందర్ సింగ్ గతంలో పార్టీని విజయ పథంలో నడిపించారు. ఇప్పుడు పంజాబ్‌ పై బీజేపీ, ఆప్ కన్నేశాయి. ఎలాగైనా హస్తం నుంచి పంజాబ్‌ను విడిపించాలని వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పటికే ఆప్ ఉచిత హామీల వర్షం కురిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇల్లు చక్కదిద్దుకునే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.

2022 ఆరంభంలో జరగనున్న పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీని ఏకతాటిపై నిలబెట్టే  చర్యలు మొదలు పెట్టారు. అయితే ఇక్కడ  ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, పార్టీ నేత నవజోత్‌ సిద్ధూ మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. అవి క్రమంగా పెరుగుతున్నాయి.

అందుకే  అమరీందర్‌ సింగ్‌, నవజోత్‌ సిద్ధూ మధ్య సయోధ్య యత్నాలు ముమ్మరం చేసింది కాంగ్రెస్. అందులో భాగంగా ముందుగా సిద్దూకు కౌన్సిలింగ్ మొదలెట్టేశారు. సిద్ధూ ఇటీవల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీతో భేటీ అయ్యారు. పార్టీలో పరిస్థితులను సిద్ధూ కాంగ్రెస్ నాయకత్వానికి వివరించినట్టు తెలుస్తోంది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ఏకరువు పెట్టినట్టు సమాచారం.

ఇక పంజాబ్ సీఎం అమరీంందర్‌కు కూడా త్వరలో కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. విభేదాల పరిష్కారానికి ఈ సమావేశంలో  అమరీందర్‌ అనేక ప్రతిపాదనలు హైకమాండ్ ముందు ఉంచే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య సయోధ్య కోసం సిద్ధూకు పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవి, ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పెద్దలతో అమరిందర్‌ భేటీకి ఇంకా తేదీ ఖరారు కాలేదు. పనిలో పనిగా పంజాబ్‌ కాంగ్రెస్‌ను కూడా ప్రక్షాళన చేయాలనే యోచనలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: