హెరాల్డ్ ఎడిటోరియల్ : కరోనా విషయంలో జగన్ తప్పు చేస్తున్నాడా ?

Vijaya
కరోనా వైరస్ నియంత్రణ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లే ఉంది. ఒకవైపు కేసులు పెరిగిపోతున్నా లాక్ డౌన్ పెట్టడంలో ఇంకా ఎందుకు మీన మేషాలు లెక్కుపెడుతున్నదో అర్ధం కావటంలేదు. రాష్ట్రంలో పాక్షికంగా కర్ఫ్యూ అమల్లో ఉంది. మధ్యాహ్నం 12  గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించినా కేసులు నియంత్రణలోకి రాకపోగా మరింతగా పెరిగిపోతున్నాయి. సగటున రోజుకు 20 వేల కేసులు నమోదవుతున్నాయంటే పరిస్ధితి ఎంత ప్రమాధకరంగా ఉందో అర్ధమైపోతోంది. అయినా లాక్ డౌన్ పెట్టే విషయంలో జగన్ ఎందుకు ఇష్టపడటం లేదో తెలీటంలేదు. కేసుల సంఖ్య బాగా పెరిగిపోతున్న ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో అక్కడి ప్రభుత్వాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.



లాక్ డౌన్ విధించిన తర్వాతే ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు అదుపులోకి వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో ఒకపుడు రోజుకు 25 వేల కేసులు నమోదయ్యేవి. అలాంటిది లాక్ డౌన్ విధించి నిబంధనలను చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయటంతో ఇపుడు సగటున 6 వేల కేసులు మాత్రమే నమోడవుతున్నాయి. ఇదే విధమైన పరిస్ధితి మహారాష్ట్రలో కూడా కనబడుతోంది. లాక్ డౌన్ విధించటం వల్ల వచ్చే లాభాలు కళ్ళముందు కనబడుతున్నా జగన్ ఎందుకనో ఆ వైపు మొగ్గు చూపటంలేదు. లాక్ డౌన్ విధించిన తర్వాత దాని ప్రభావం కచ్చితంగా ఆర్ధికపరిస్ధితిపై పడుతుందనటంలో సందేహం లేదు. కానీ మనిషి ప్రాణాలకన్నా అవేవీ ముఖ్యం కాదన్న ఉద్దేశ్యంతోనే ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ లాక్ డౌన్ విధించిన విషయం జగన్ గుర్తించాలి.



ఇదే విషయమై సోమవారం ఉన్నతాధికారులతో జగన్ సమీక్షించారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం 10 శాతం కేసులు దాటితో ప్రమాధంలో ఉన్నట్లే. మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో 30 శాతం కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే లాక్ డౌన్ విధించటమా లేకపోతే కర్ఫ్యూ వేళలను మరింతగా కుదించటమా అనే విషయమై చర్చ జరిగింది. ఉన్నతాధికారులేమో సంపూర్ణ లాక్ డౌన్ పై మొగ్గు చూపారట. కానీ జగన్ మాత్రం కర్ఫ్యూను నెలాఖరువరకు కంటిన్యు చేయాలని డిసైడ్ చేశారు. కర్ఫ్యూ వేళలు రిలాక్స్ కాగానే జనాలు ఒక్కసారిగా తామరతంపరగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. వీరిలో అవసరం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చి తిరిగేస్తున్నారు. దీంతోనే కేసులు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి మన జనాలకు కర్ఫ్యూ లాభం లేదని లాక్ డౌన్ ఒకటే మార్గమని జగన్ ఎంత తొందరగా గ్రహిస్తే రాష్ట్రానికి అంతమంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: