మోడీ గడ్డం డ్రామాపై... మమత వీల్ చైర్ డ్రామాయే గెలిచిందిగా..?
ఇక బెంగాల్ ఎన్నికల విషయానికి వస్తే.. అటు బీజేపీ, ఇటు టీఎంసీ ఎన్నో డ్రామాలు ఆడాయి.. ఎన్నో ఎత్తులు ప్రయోగించారు. బెంగాల్ కోసం ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా కొన్ని నెలల ముందు నుంచే గడ్డం పెంచడం ప్రారంభించారన్న వాదన ఉంది. ఎందుకంటే.. బెంగాళీయులు తమ వాడు అని గర్వంగా చెప్పుకునే మహానుభావుడు.. సాహిత్యంలో నోబెల్ పొందిన ఏకైక భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగోర్ ను తలపించాలని మోడీ ప్రయత్నించినట్టు విశ్లేషణలు వినిపించాయి.
అంతే కాదు. అటు సుభాష్ చంద్రబోస్ తో పాటు.. అనేక అవార్డులు విషయంలోనూ మోడీ సర్కారు భావోద్వేగం రగల్చే ప్రయత్నం చేసింది. బెంగాలీయులు మనసులు గెలుచుకునే ప్రయత్నం చేసింది. మరోవైపు.. మమతా బెనర్జీ కూడా భావోద్వేగం రగిల్చి ప్రయత్నాలు ప్రారంభించారు. మోడీ, అమిత్ షా వ్యూహాలకు ఎదురు వ్యూహాలు రచించారు. ఒక దశలో మమతపై మోడీ అమిత్ షా ద్వయం పైచేయి సాధిస్తుందనుకున్న దశలో ఇక మమత బ్రహ్మాస్త్రం బయటకు తీశారు.
ఓ ఎన్నికల ప్రచారంలో తనపై దాడి జరిగిందంటూ ఆమె నానా రచ్చ చేశారు. తన కాలుకు దెబ్బ తగిలిందని కొన్నాళ్లు ఆస్పత్రిలో ఉన్నారు. ఇక ఆస్పత్రి నుంచి బయటకొస్తూ వీల్ చైర్ పై నుంచే ప్రచారం సాగించారు. ఆసాంతం ఆమె ప్రచారం అంతా వీల్ చైర్ పై నుంచే సాగింది. ఇలా రంజుగా సాగన బెంగాల్ రాజకీయ రణక్షేత్రంలో చివరకు మమత డ్రామాయే నెగ్గింది. మళ్లీ అధికారం మమత వశమైంది.