అందరు అనుమానిస్తున్నట్లే చాలా వ్యూహాత్మకంగా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలనుండి తప్పించుకున్నారు. బాధ్యతలనుండి తప్పుకున్నారు అనేకంటే ఉద్దేశ్యపూర్వకంగానే చేతులెత్తేసినట్లు అనుకోవాలి. విషయం ఏమిటంటే పెండింగ్ లో ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను ఈనెల 31వ తేదీలోగా నిర్వహించాల్సుంది. అయితే ఇంతవరకు పరిషత్ ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ నోటిఫికేషన్ జారీ చేయలేదు. దాంతో పరిషత్ ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని తేలిపోయింది. కారణాలు ఏవైనా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ అనుకోలేదు. ఇంతకాలం ఏమీ మాట్లాడని నిమ్మగడ్డ తన మనసులోని మాటను హైకోర్టుకు చెప్పేశారు.
రాజ్యాంగం అన్నారు, చట్టమన్నారు, స్ధానికసంస్ధల ఎన్నికల నిర్వహణ ఎలక్షన్ కమీషనర్ విధి, బాధ్యతంటు చాలా పెద్ద పెద్ద డైలాగులే చెప్పారు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలంటే కాదు కూడదని కోర్టులకు వెళ్ళి మరీ తన మాట చెల్లించుకున్నారు. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కూడా ఎన్నికలకు ఏర్పాట్లు చేసింది. పంచాయితి, మున్సిపల్ ఎన్నికలను వెంటవెంటనే జరిపించేసిన కమీషనర్ పరిషత్ ఎన్నికల నిర్వహణకు మాత్రం చొరవ చూపలేదు. అదేమంటే నెల రోజుల ఎన్నికల కోడ్ కుదరదని చెప్పారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగమంతా కరోనా వ్యాక్సిన్ వేసుకోవటంలో బిజీగా ఉన్నారట.
ఎవరు ఊహించన విధంగా పంచాయితి, మున్సిపల్ ఎన్నికలను వైసీపీ మద్దతుదారులు, అభ్యర్ధులు క్లీన్ స్వీప్ చేసేశారు. నిమ్మగడ్డ ఒకటనుకుండే ఫలితాలు మరోలాగ వచ్చాయని వైసీపీ నేతలు ఎద్దేవాకూడా చేశారు. బహుశా పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తే ఫలితం ఇలాగే ఉంటుందన్న కారణంతోనే నిమ్మగడ్డ ఏమీ మాట్లాడటం లేదా ? అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమీషన్ దే అంతిమ నిర్ణయమని ఒకటి వందసార్లు చెప్పిన నిమ్మగడ్డ మరి పరిషత్ ఎన్నికల నిర్వహణ బాధ్యతల నుండి ఎందుకు తప్పుకున్నట్లు ? ఈనెల 31వ తేదీన కమీషనర్ రిటైర్ అవుతున్నారు. అయితే ఈలోగా పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. పరిషత్ ఎన్నికలతో పాటు పెండింగ్ లో ఉన్న కొన్ని మున్సిపాలిటి ఎన్నికలను కొత్త కమీషనర్ నిర్వహించాల్సుంటుంది. మొత్తానికి కారణాలు ఏవైనా నిమ్మగడ్డ అయితే బాధ్యతల నుండి తప్పించుకున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి చేష్టలు చేసినందుకే నిమ్మగడ్డపై ప్రభుత్వం తీవ్రస్ధాయిలో మండిపోతోంది.