హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరా ?

Vijaya
అంటే మనం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఏమీ లేదులేండి. ఎందుకంటే మొన్నటి మీడియా సమావేశంలో తాను చెప్పదలచుకున్నది చెప్పేసి రిపోర్టర్లను పంపేశారు. అదేమిటంటే తనను ఎవరు డస్ట్రబ్ చేయవద్దంటూ దడ్డం పెట్టేశారు. ఇలాగుంటుంది స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారం. సరే కమీషనర్ చెప్పినా చెప్పకపోయినా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని జనాలు అనుకుంటున్నారు. జనాల మదిలో మెలుగుతున్న ఆ ఐదు ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. మొదటిది : అసలు ఇపుడు జరుగుతున్న ఎన్నికలు ఎప్పుడు జరగాల్సింది ? రెండోది : ఏ ప్రభుత్వమైనా పంచాయితీ ఎన్నికలను ఏకగ్రీవంగానే జరగాలని కోరుకుంటాయి. మరి నిమ్మగడ్డ మాత్రం ఎందుకని ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు ?



మూడోది : మొన్నటి మార్చిలో జరుగుతున్న ఎన్నికలను వాయిదా వేసినపుడు కరోనా వైరస్ కేసులు ఎన్ని రికార్డయ్యాయి. ఇపుడు ఎన్నికలు జరుగుతున్నపుడు ఎన్ని ఉన్నాయి ? నాలుగు : పార్టీ రహితంగా జరిగే పంచాయితి ఎన్నికలకు మ్యానిఫెస్టో రిలీజ్ చేయవచ్చా ? ఐదు : ఎంత కమీషనర్ అయినా ఎవరి మీదపడితే వాళ్ళపైన నోటీసులు కూడా ఇవ్వకుండానే యాక్షన్ తీసుకునే అధికారాలు ఉన్నాయా ?  ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రశ్నలున్నప్పటికీ ముందు వీటికి నిమ్మగడ్డ జవాబులు చెబితే తర్వాత మిగిలిన వాటి విషయాలు చూడవచ్చు.



నిజానికి ఇఫుడు జరుగుతున్న ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగాల్సింది 2018 జూలై-ఆగష్టులో. మూడు మాసాల్లోనే ఎన్నికలు పెట్టాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించినా చంద్రబాబునాయుడు, నిమ్మగడ్డ పట్టించుకోలేదు. గ్రామస్ధాయిలో గొడవలు జరకూడదన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పంచాయితి ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించటం ఎప్పటినుండో వస్తోంది. మరి దీన్ని నిమ్మగడ్డ ఎందుకింతగా వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావటం లేదు. మొన్నటి మార్చిలో బూచిగా చూపించి ఎన్నికలను వాయిదా వేసేసమయానికి రికార్డయిన కేసులు కనీసం 20 కూడా లేదు. ఇప్పుడు నిమ్మగడ్డ లెక్కల ప్రకారమే రోజుకు 200 నమోదవుతున్నాయి. మరప్పటికన్నా ఇపుడు కేసులు ఎక్కువగానే ఉన్నట్లు కదా. పార్టీ రహితంగా జరిగే పంచాయితి ఎన్నికల్లో పార్టీలు మ్యానిఫెస్టో రిలీజ్ చేసేందుకు లేదు. మరి నిబంధనలకు విరుద్ధంగా మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన చంద్రబాబుపై నిమ్మగడ్డ ఏమి యాక్షన్ తీసుకుంటారు ? ఇక యాక్షన్ తీసుకునే విషయానికి వస్తే ఎవరిమీద పడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అధికారం నిమ్మగడ్డకు లేదు. యాక్షన్ తీసుకోమని సిఫారసు మాత్రమే చేయగలరు. అదికూడా ముందు వాళ్ళకు నోటీసులిచ్చి, వాళ్ళ సమాధానం సంతృప్తిగా లేకపోతేనే అదికూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: