కరోనా చికిత్స కోసం పక్క రాష్ట్రాలకు : జగన్.. ఒకసారి ఇది చూడవయ్యా..!

Sunil Medarametla

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి దెబ్బకి ఒక్కసారిగా స్తంభించిపోయింది. అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలం అయిపోయాయి. ఈ మహమ్మారి బారిన ఇప్పటికే కోటి మందికి పైగా పడగా.. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కూడా దీని వ్యాప్తి తీవ్రంగానే ఉంది. ప్రముఖులు, నాయకులు, అధికారులను సైతం ఈ మహమ్మారి వదల్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే, కరోనా సోకే విషయంలో తేడాలు లేనప్పటికీ….కరోనాకు చికిత్స అందుకునే విషయంలో మాత్రం పేద, ధనిక తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

పేద ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుంటే.. ధనికులు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి ముఖ్యకారణం ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరైన సదుపాయాలు లేవని ఆరోపణలు రావడం. అయితే ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకుల తీరు మాత్రం మరీ విచిత్రంగా ఉంది. ఏపీలో డాక్టర్ల పనితీరు సరిగ్గా లేదనుకున్నారో, ఏమో గానీ, కొందరు నాయకులు ఏకంగా రాష్ట్రాన్ని దాటి.. పరాయి రాష్ట్రాలకు వెళ్ళి మరీ చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా, కరోనా పాజిటివ్ అని తేలిన వైఎస్సార్సీపీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇక, ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఆయన భార్య,కుమార్తె కరోనా బారిన పడడంతో…మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌ లో చేరారని సమాచారం.

 

దీంతో పాలకులకే మన రాష్ట్రంలోని ఆసుపత్రులపై నమ్మకం లేకుంటే…ప్రజలకు ఎక్కడ నుంచి వస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా వీరిద్దరూ అధికార పార్టీ నేతలు కావడం గమనార్హం. ఒకవేళ ఇదే పని ప్రతిపక్ష నాయకులు చేస్తే.. సరే ప్రభుత్వంపై బురద జల్లేందుకో, ఏదో రాజకీయ లబ్ధికోసమో ఇలా చేస్తున్నారేమో అని ప్రజలు భావించేవారు. కానీ, అధికార పార్టీ నేతలే ఇలా చేయడంతో.. నిజంగానే రాష్ట్రంలో వైద్య సదుపాయాలు సరిగ్గా లేవేమో అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. దీనికి తోడు.. అధికార పార్టీని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్షాలకు ఇదొక ఆయుధంగా మారింది. మరి సీఎం జగన్ మోహన్ రెడ్డి దీన్ని సీరియస్ గా తీసుకుని నాయకులు  కూడా రాష్ట్రంలోనే చికిత్స పొందాలి అనే షరత్తు పెడతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: