వైఎస్సార్‌ని ఓటమి అంచులకు తీసుకెళ్లిన ప్రత్యర్ధి ఈయనే..

M N Amaleswara rao

వైఎస్సార్...రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్రవేసుకున్న నాయకుడు. అసలు ఓటమి అంటే తెలియని వైఎస్సార్‌ని ఓ నాయకుడు మాత్రం ఓటమి అంచుల వరకు తీసుకెళ్లారు. ఊహించని విధంగా భారీ మెజారిటీతో గెలుపు సాధ్యమనుకున్న వైఎస్సార్‌కు చుక్కలు చూపించారు. యువనాయకుడుగా కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైఎస్సార్...1978 ఎన్నికల్లో తొలిసారిగా పులివెందుల నుంచి పోటీ చేసి సూపర్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే.

 

ఇక టీడీపీతో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించిన 1983, 1985 ఎన్నికల్లో కూడా పులివెందులలో వైఎస్సార్ అదిరిపోయే విజయాలు అందుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో వైఎస్సార్ పులివెందులని వదిలేసి...1989 ఎన్నికల్లో కడప ఎంపీగా బరిలో దిగి విజయం సాధించారు. లక్షా 66 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి ఎం‌వి రమణా రెడ్డిని ఓడించారు. తర్వాత రాజీవ్ గాంధీ మరణం నేపథ్యంలో వచ్చిన 1991 ఎన్నికల్లో కూడా వైఎస్సార్ గెలుపు ఆగలేదు. అప్పటిలోనే దాదాపు 4 లక్షల పైనే మెజారిటీతో గెలిచారు. అప్పుడు టీడీపీ తరుపున సి. రామచంద్రయ్య పోటీ చేశారు.

 

అయితే 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్‌ దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్ళిపోయారు. అప్పటికే రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండటంతో కడప బరిలో నిలిచిన కందుల రాజమోహన్ రెడ్డి, వైఎస్సార్‌కు గట్టి పోటీ ఇచ్చారు. సులువుగా విజయం సాధించేస్తారనే వైఎస్‌కు చుక్కలు చూపించారు. అయితే చివరిలో వైఎస్సార్ 5 వేల మెజారిటీతో ఎలాగోలా గట్టెక్కారు.

 

ఆ ఎన్నికల్లో వైఎస్సార్ 368,611 ఓట్లు సాధించగా, కందుల రాజమోహన్ రెడ్డి 363,166 ఓట్లు సాధించారు. దీంతో వైఎస్సార్ 5,435 ఓట్ల స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. అసలు వైఎస్ రాజకీయ జీవితంలో ఓటమి అంచుల వరకు తీసుకెళ్లిన ప్రత్యర్ధి రాజమోహన్ రెడ్డినే. అయితే ఆ వెంటనే 1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్..రాజమోహన్ రెడ్డిపై 53 వేల మెజారిటీతో గెలిచారు. మొత్తానికైతే 1996 ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్ ఓటమి అంచుల వరకు వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: