బడి ఫీజులో బయటపడుతున్న లింగవివక్ష!

Mekala Yellaiah
ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతుండడంతో లింగవివక్షతకు దారితీస్తోంది. చదువు‛కొనేందుకు’ లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎవరినో ఒకరిని చదివించే పరిస్థితి వచ్చింది. దీంతో పేరెంట్స్ ఇప్పుడు ఆడపిల్లలను కాదని మగపిల్లలకే చదువులో ప్రాధాన్యమిస్తున్నారు. ఇది లింగవివక్షతను పెంచుతోంది. సర్కార్ బడుల్లో కంటే అంతర్జాతీయ పాఠశాలల్లోనే ఉన్నత ప్రమాణాలు గల చదువు అందుతుందని చాలా మంది తల్లిదండ్రులు అపోహ పడుతున్నారు. అందుకోసమే వారు ఆర్థిక తాహతుకు మించి ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు లక్షల రూపాయల ఫీజులు గుంజుతున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చుతున్నాయి. ఇంటర్నేషనల్ స్కూళ్లలో తమ పిల్లలను చదివించడం చాలా మంది తల్లిదండ్రులు స్టేటస్ గా భావిస్తున్నారు. అయితే ఆ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందుతుందా అంటే కచ్చితంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. లక్షల రూపాయల ఫీజులు చెల్లించి ఒకరిని మాత్రం చదివిస్తామని, ఇద్దరిని చదివించడం సాధ్యం కాదని తల్లిదండ్రులు అంటున్నారు. ఆడపిల్ల చదువుకు అంత ఖర్చు ఎందుకని, మగపిల్లాడికైతే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలను వీధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తూ, అబ్బాయిలను మాత్రం లక్షల రూపాయలు పెట్టి ఇంటర్నేషనల్ పాఠశాలల్లో చదివిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు విపరీతంగా పెంచుతుండడమే ఈ దుస్థితికి కారణమవుతోంది. తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల పెంపును సమీక్షించి, తగిన సిఫార్సులు చేసేందుకు సర్కార్ 2017 మార్చిలో  ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ప్రజల నుంచి వస్తున్న విమర్శలతో సర్కార్ ఈ కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక వచ్చిన తరువాతనే పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియను మొదలుపెట్టాలని అప్పుడు సర్కార్ మొదట ఆదేశాలు ఇచ్చింది. తరువాత కార్పొరేట్ శక్తుల లోపాయికారి ఒప్పందాలతో 2018 జనవరి నుంచి షరతులకు లోబడి ప్రవేశాలు మొదలుపెట్టాలని అనుమతి ఇచ్చింది. తిరుపతిరావు కమిటీ రిపోర్టును పూర్తి స్థాయిలో సమీక్షించిన తరువాతనే ఫీజులను నిర్ణయిస్తామని, అప్పటి వరకు యథాతథంగా ఫీజులు అమలులో ఉంటాయని చెప్పింది. ప్రవేశాలకు సంబంధించి పోయిన ఏడాది నిర్ణయించిన ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సర్కార్ ఆదేశాలు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రతి ఏటా రాబోయే విద్యా సంవత్సరానికి నవంబర్ నెలలోనే ప్రవేశాల ప్రక్రియను మొదలుపెడుతూ, లక్షల ఫీజులను గుంజుతున్నాయి. అనేక ప్రైవేట్ పాఠశాలలు 10 శాతం ఫీజులు పెంచుతూ దోపిడీకి తెగబడుతున్నాయి.
* అడ్డగోలు వసూళ్లు..
తెలంగాణలో సుమారు 50 అంతర్జాతీయ పాఠశాలలు అసోసియేషన్ కింద నడుస్తుండగా, రాష్ట్రంలో మొత్తం పాఠశాలలు  52,359 ఉన్నాయి. ఇందులో సర్కార్ స్కూళ్లు 40,818 ఉండగా, ఈ పాఠశాలల్లో 22,38,721మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రైవేటు పాఠశాలలు11,541 ఉండగా, ఇందులో 26,90,844 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల విషయానికి వస్తే అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు గుంజుతున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో కిండర్ గార్టెన్ కు రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. గ్రేడ్ 1 నుంచి 5 వరకు రూ. 5,76,500, గ్రేడ్ 6 నుంచి 8 వరకు రూ. 5,76,500,  గ్రేడ్ 9 నుంచి 10 వరకు రూ. 7,60,000 ఫీజుల రూపంలో పిండుతున్నారు. ఇక మన్‌థన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో కిండర్ గార్టెన్ కు రూ.85,000, గ్రేడ్ 1 నుంచి 5 వరకు  రూ.98,000, గ్రేడ్ 6 నుంచి 8 వరకు రూ.1,11,000,  గ్రేడ్ 9 నుంచి 10 వరకు రూ.1,32,000 వసూలు చేస్తున్నారు. బండ్లగూడలోని గ్లెండేల్ అకాడమీలో గ్రేడ్ 1 నుంచి 5 వరకు రూ.1,95,000, గ్రేడ్ 6 నుంచి 8 వరకు రూ.2, 50,000, గ్రేడ్ 9 నుంచి 10 వరకు రూ.2,55,000 గుంజుతున్నారు. శాంక్టా మేరియాలో గ్రేడ్ 1 నుంచి 4 వరకు రూ.2,40,000 వసూలు చేస్తుండగా, గ్రేడ్ 5 నుంచి 7 వరకు రూ.2,76,146, గ్రేడ్ 8 నుంచి 9 వరకు రూ.3,14,635,  గ్రేడ్ 10 కి రూ.3,39,275 ఫీజులు తీసుకుంటున్నారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో గ్రేడ్ 1 నుంచి 5 వరకు రూ.75,521, గ్రేడ్ 6 నుంచి 10 వరకు రూ.89,562 వసూలు చేస్తుండగా, భారతీయ విద్యాభవన్ లో కిండర్ గార్టెన్ కే రూ. 2,25,000 గుంజుతుండగా,1 తరగతి నుంచి 10 తరగతి వరకు రూ.2,75,000 వసూలు చేస్తున్నారు.
* కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా ప్రభుత్వం
కార్పొరేట్ విద్యాసంస్థల  లాభార్జనను ప్రభుత్వం నియంత్రించని విధంగా సహాయపడుతుండడంతో అవి రెచ్చిపోతున్నాయి. అంతర్జాతీయ నగరంగా పేరున్న హైదరాబాద్ లో ఆ స్థాయిలో విద్యా ప్రమాణాలు కనిపించడంలేదు. ఫీజులు వసూలు చేస్తున్నట్టుగా వసతులు కల్పించడంలేదు. దీనిపై ప్రభుత్వం ఏమాత్రం పర్యవేక్షించడంలేదు. ప్రతి ఏటా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫీజులు పెంచక తప్పడంలేదని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ నిస్సిగ్గుగా చెబుతోంది. తెలంగాణలో 80 శాతం ప్రైవేట్ పాఠశాలలకు సొంత భవనాలు లేవు. కార్పొరేట్, అంతర్జాతీయ పాఠశాలలకు తగినట్టు నాణ్యమైన విద్యను అందించకున్నా ఫీజులు మాత్రం గుంజుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. ఫీజుల నియంత్రణ కోసం 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 91 తెచ్చింది. దీనిని హైకోర్టు కొట్టివేసింది. అయినా ఫీజులను  నియంత్రించాలనే సదుద్దేశంతో మళ్లీ 2010లో జీవో 42 తీసుకొచ్చింది. దీనిపై కూడా ప్రైవేట్ విద్యాసంస్థలు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాయి. ఇప్పుడు తెలంగాణ సర్కార్ మాత్రం ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకే అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా లింగవివక్ష పెరిగిపోయి, ఆడపిల్లలను ఎదగకుండా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: