పోలవరంపై ఏపీ, తెలంగాణ కీచులాటలు తగ్గలేదుగా?

పోలవరం ప్రాజెక్టు అంశంపై ఏపీ, తెలంగాణ మధ్య కీచులాటలు తగ్గట్లేదు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంపై సర్వే చేపట్టాలన్న ఆదేశాలపై ప్రాజెక్టు అథారిటీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, తక్షణమే సర్వే చేసేలా చూడాలని కేంద్ర జలసంఘాన్ని తాజాగా తెలంగాణ ప్రభుత్వం కోరింది. తాజాగా సీడబ్ల్యూసీ ఛైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు పీపీఏ ఆధర్యంలో ఉమ్మడి సర్వే చేపట్టాలని ఆయన కోరారు.

మూడు సాంకేతిక సమావేశాలతో పాటు సమన్వయ సమావేశంలో నిర్ణయించినట్లు లేఖలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. బ్యాక్ వాటర్స్, ముంపు ప్రభావానికి సంబంధించి పలు అంశాలను తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పొందుపరిచారు. పోలవరంలో ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో 954 ఎకరాలు ముంపునకు గురవుతుందన్న అంచనా ఉందని.. దీనిపై పీపీఏ వాస్తవాలు నిర్ధారించుకొని ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా రక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కోరారు.

కిన్నెరసాని, ముర్రేడువాగుల నుంచి డ్రైనేజీ ప్రవాహానికి సంబంధించి సీడబ్ల్యూసీ 2021 జూన్ లోనే నివేదిక ఇచ్చిందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. అందుకు అనుగుణంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. దుమ్ముగూడెం ఆనకట్టు  దిగువన గోదావరిలో కలిసే ఏడు స్థానిక ప్రవాహాల కారణంగా ఉత్పన్నమయ్యే ముంపును గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని.. ఇతర 30 ప్రవాహాలకు కూడా ఇదే కసరత్తు చేయాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు.

భద్రాచలం పట్టణం, మణుగూరు భారజల కేంద్రానికి సంబంధించి ఇంపార్టెంట్ లెవెల్స్ ను తనిఖీ చేసేందుకు తక్షణమే ఉమ్మడి సర్వే చేపట్టాలని తెలంగాణ ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. 2010లో ఆమోదించిన డీపీఆర్ లోని సిఫారసులకు అనుగుణంగా కరకట్టలు నిర్మించేందుకు ఉమ్మడి సర్వే చేపట్టాలని తెలంగాణ ఈఎన్సీ కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివరాలు అంది రెండు వారాలు గడచినప్పటికీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలంగాణ ఈఎన్సీ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: