నిరుద్యోగ ర్యాలీలతో కదం తొక్కనున్న కాంగ్రెస్‌?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీని క్రియాశీలకంగా ఉంచేందుకు ప్లాన్ రెడీ చేసింది. తాజాగా ఇవాళ్టి నుంచి విద్యార్ధి, నిరుద్యోగ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరసుగా నిరుద్యోగ నిరసన ర్యాలీలను కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనుంది. టిఎస్‌పిఎస్‌సీ పేపర్‌ లీకేజి ప్రభావం దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులపై పడిందంటున్న కాంగ్రెస్‌.. దీనిని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగుల తరఫున పోరాటానికి రెడీ అయ్యింది.

ఇవాళ  ఖమ్మంలో, ఈ నెల 26న అదిలాబాద్‌, ఈ నెల 28వ తేదీన నల్గొండ, 30వ తేదీన మహబూబ్‌నగర్‌, వచ్చే నెల ఒకటో తేదీన రంగారెడ్డి జిల్లాల్లో సన్నాహక ర్యాలీలు నిర్వహిస్తోంది. అందరి ఆమోదయోగ్యంతో ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ ఖమ్మం పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారీ ప్రదర్శన ఉంటుంది. మయూరి సెంటర్, పాత బస్టాండ్ వరకు ఈ  ప్రదర్శన కొనసాగుతుంది.ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితోపాటు ఇతర సినియర్‌ నాయకులు పాల్గొంటారు.

కాంగ్రెస్‌ పార్టీ వచ్చే నెల నాలుగైదు తేదీలల్లో హైదరాబాద్‌ సరూర్‌ నగర్‌ స్టేడియంలో బారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకు సన్నాహక సమావేశాలు నిర్వహించడంలో భాగంగా రోజుకొక విశ్వవిద్యాలయాన్నిసందర్శించి అక్కడ నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ నేతలు ఎండగడతారు. ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై మరింత ఒత్తిడి పెంచి సిట్టింగ్‌ జడ్జికాని, సీబీఐకి కాని అప్పగించాలంటూ  కాంగ్రెస్ నేతలు  డిమాండ్‌ చేస్తున్నారు.

ఇప్పటికే న్యాయస్థానాన్నిఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి విభాగం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  నిరుద్యోగ నిరసన సభ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజావ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకోవచ్చని  కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. అటు బీఆర్‌ఎస్‌.. ఇటు కాంగ్రెస్‌.. మరోవైపు బీజేపీ వరుసగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ ఎన్నికల వాతావరణాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: