జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడుగా ముందుకెళుతున్నారు. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్సీ గా ఎన్నికైన వ్యక్తి పులివెందులకు చెందిన వ్యక్తి కావడం ఇక్కడ గమనార్హం. దీంతో కడపలో ఎలాగైనా టీడీపీని మరింత బలంగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కడప జిల్లాకు చెందిన నాయకులతో సమావేశానికి ప్లాన్ చేశారు. బద్వేల్ లో మీటింగ్ పెట్టి టీడీపీ ని వచ్చే ఎన్నికల్లో కడపలో ఎలా బలంగా నిలబెట్టాలో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటివరకు రాయలసీమలో బలంగా ఉన్న వైసీపీ కి ఇది పెద్ద ఎదురుదెబ్బ.

కడప, పులివెందులలో వైఎస్ కుటుంబానికి, వైఎస్ జగన్ కి కూడా భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిల నుంచి పుల్ సపోర్టు ఉండేది. అయితే భాస్కర్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టు కావడం, అవినాష్ రెడ్డి కూడా మరి కొన్ని రోజుల్లో అరెస్టు అయితారనే సంకేతాలు వస్తుండటంతో వైసీపీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగలనుందా.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పులివెందుల, కడప జిల్లాలో బలమైన సామాజిక వర్గం, ఏళ్ల తరబడి కంచుకోటలా ఉన్న ప్రాంతాలు భాస్కర్ రెడ్డి అరెస్టుతో కుదేలయ్యే అవకాశం కనిపిస్తోంది.

దీన్ని అంతే స్థాయిలో ఒడిసి పట్టుకుని అధికారంలోకి రావాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం వైఎస్ జగన్ ఎలాంటి ప్రణాళికతో రాబోతున్నారో ఎవరికి అంతుపట్టడం లేదు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చేస్తున్న దర్యాప్తు సొంత మనుషులనే అరెస్టు చేస్తుంటే చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. ఇదే హవా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం అంత సులభమేం కాదు. మరి జగన్ కడపతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: