వైద్య విద్య రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ?

తెలంగాణలో వైద్య విద్య పరంగా అభివృద్ధి జోరుగా ఉంది. కొత్తగా అనేక వైద్య కళాశాలలు మంజూరయ్యాయి. జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు నిర్ణయించారు.

వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్‌ పరిధితో పాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్ నగర్ , ఎల్బి నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలను సైతం వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు  అన్నారు.  వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల పనులు పురోగతి, ఇతర అంశాలపై మంత్రి హరీశ్ రావు తాజాగా ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. వరంగల్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో  అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చనున్నట్టు  తెలిపారు.  

ఈ ఆస్పత్రిలో మాడ్యులర్ థియేటర్లు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశమే లేకుండా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు.  ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి హరీశ్ రావు తెలిపారు.   ఆసుపత్రుల  పనులను వేగంగా పూర్తి చేసి   ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని మంత్రి హరీశ్‌రావు  అన్నారు. వీటితో పాటు 8 టీచింగ్ ఆసుపత్రుల నిర్మాణ పనులును సైతం త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు  ఆదేశించారు. ఏదేమైనా తెలంగాణ ఏర్పాటయ్యాక వైద్యం పరంగా మౌలిక వసతుల కల్పనలో చక్కటి అభివృద్ధి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: