2024: వైసీపీలోనూ వారసులు వచ్చేస్తున్నారా?

వచ్చే అసేంబ్లీ ఎన్నికల్లో తమ వారసులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వమని అన్ని రాజకీయ పార్టీలో ముందస్తుగానే బుకింగ్ చేసుకుంటున్నారు. టీడీపీ నుంచి చింత కాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని కోరుతూనే, తనకు కూడా కావాలని అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిటాల సునీత కూడా పరిటాల శ్రీరామ్ తో పాటు తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశిస్తున్నారు.

వైసీపీలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ కు టికెట్ కావాలని అడుగుతున్నట్లు సమాచారం. అయితే మోహిత్ కు టికెట్ ఇచ్చినా చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పజెప్పే లా జగన్ ఆలోచిస్తున్నట్లు వినికిడి. పేర్నీ నాని లాంటి వారిని మీరే పోటీ చేస్తే బాగుంటుందని జగన్ అన్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణకు కూడా ఇదే విధంగా జగన్ చెప్పినట్లు బయట వినిపిస్తున్న టాక్. తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, ఎమ్మిగనూరు, ఒంగోలు, రామంచంద్రపురం, అమలాపురం, యలమంచిలిలో వారసులకు టికెట్లు అడుగుతున్నట్లు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

దీనిపై జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలు, తమ్మినేని సీతారాం, పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన ప్రసాదరావు, వీరభద్ర స్వామి, మంత్రి బొత్స కూడా తమ వారసులను బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడ ఏ సీట్లను ఇవ్వాలి. ఎవరు గెలిచే అవకాశం ఉంటుందనే అన్ని అంచనాలను బేరీజు వేసుకుని ఈ సారి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలనే కసితో టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో వారసులకు టికెట్లు ఇస్తే వారు ప్రతిపక్షాలు చేసే విమర్శలను ఎలా తట్టుకుంటారనేది  ప్రశ్న. వైసీపీ వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా బలమైన నేతలను నిలబెట్టాల్సిందే.  ఎవరికి టికెట్లు దక్కుతాయో, ఎవరికి నిరాశ కలుగుతుందో ఎన్నికల వరకు వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: