ఇలాంటి పాలకుడు ఉన్నా లేనట్టే.. జగన్‌పై పవన్‌ ఫైర్‌?

వైసీపీ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి సమీపంలో అంధ యువతి హత్యకు గురైన ఘటన కలచివేసిందంటున్నారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. కంటి చూపునకు నోచుకోని ఆ యువతిని వేధింపులకు గురి చేసి కిరాతకంగా నరికి చంపిన మృగాడిని కఠినంగా శిక్షించాలన్న పవన్‌ కల్యాణ్‌.. గంజాయి మత్తులో సదరు వ్యక్తి నేరానికి ఒడిగట్టాడని, గతంలోనూ పోలీసులపైనా, మహిళలపైన దాడులకు తెగబడ్డాడని పోలీసులు చెబుతున్నారన్నారు.

ఈ హత్య ఘటనను శాంతిభద్రతల వైఫల్యంగా చూడాలని... ముఖ్యమంత్రి ఇంటి పరిసరాల్లో పటిష్టమైన పోలీసు పహారా, నిఘా వ్యవస్థలు పని చేస్తున్నా తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు, గంజాయికీ అడ్డాగా మారిందని... అంటే లోపం ఎక్కడ ఉందని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. ఏడాదిన్నర క్రితం ఆ ప్రాంతంలోనే ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్లో ఒకర్ని ఇప్పటికీ పట్టుకోలేకపోయారంటే వైఫల్యం ఎవరిదని పవన్‌ కల్యాణ్‌ నిదీశారు.

తన నివాసం పరిసరాల్లో పరిస్థితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటేనని.. పోలీసు శాఖకు అవార్డులు వచ్చాయి, దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రంలో ఆడబిడ్డలకు మాత్రం రక్షణ లేకుండాపోయిందని పవన్‌ కల్యాణ్‌ వాపోయారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులే పటిష్ట చర్యలు తీసుకోవాలన్న పవన్‌ కల్యాణ్‌.. దీనిపై  అన్ని వర్గాలూ ఆలోచన చేయాలన్నారు.
 
అత్యాచారాలు చోటు చేసుకొంటున్నాయి అంటే తల్లి పెంపకంలోనే లోపం ఉందని.. ఏదో దొంగతనానికి వచ్చి రేప్ చేశారు అంటూ వ్యాఖ్యానించే మంత్రులు ఉన్న ప్రభుత్వం ఇదని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఆడపడుచులపై అఘాయిత్యాలు సాగుతున్నా మహిళా కమిషన్ ఏం చేస్తోందన్న పవన్‌ కల్యాణ్‌.. పదవులు ఇచ్చినవారిని మెప్పించేందుకు రాజకీయపరమైన ప్రకటనలు, నోటీసులు ఇస్తే మహిళలకు రక్షణ, భరోసా దక్కవని గుర్తించాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని... గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ను మార్చేశారని.. శాంతిభద్రతల వైఫల్యం, ఆడ బిడ్డలపై అఘాయిత్యాలపై మహిళా సంఘాలు, మేధావులు, న్యాయ నిపుణులు గళమెత్తాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: