కేసీఆర్‌ సార్‌.. ఆ జీవోతో ప్రాణాలు పోతున్నాయ్‌..?

జీవో నెంబర్ 317.. ఈ జీవో తమ ప్రాణాలు తీస్తోందంటున్నారు కొందరు తెలంగాణ ఉపాధ్యాయులు.. ఈ జీవో కారణంగా తాము స్థానికత కోల్పోయి నష్టపోతున్నామంటున్నారు. హైదరాబాద్ లకిడికపుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు... జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘం ఆందోళనకు కూడా దిగారు. జీవో 317 ద్వారా స్థానికతను కోల్పోయి నష్టపోయిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు.

ఈ ఆందోళన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు ఉపాద్యాయులను లోపలికి అనుమతించక పోవడంతో ఇరువురికి తీవ్ర వాగ్వివాదం కూడా జరిగింది. 317 జీవో కారణంగా స్థానికతను కోల్పోయి వేరే జిల్లాలలో విధులు నిర్వహిస్తున్నామని ఈ ఉపాధ్యాయులు అంటున్నారు. తమ ప్రాణాలు కాపాడాలని జీవో 317 బాధిత ఉద్యోగ , ఉపాధ్యాయుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికత మా జన్మ హక్కు అనే నినాదంతో హైదరాబాద్‌లోని లక్డికపుల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఈ జీవో కారణంగా  మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్యాలకు గురవుతున్నామని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది నుండి ఈ జీవోకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు విమర్శించారు. దూరప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల తమ పిల్లలను చూసుకోవడం కష్టంగా మారిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

అంతే కాదు.. ఈ జీవో తెచ్చిన కష్టాల కారణంగా ఇప్పటివరకు దాదాపు 30 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో సవరించి స్థానికత ఆధారంగా పోస్టింగ్ లు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని ఉపాధ్యాయులు  హెచ్చరించారు. అనంతరం సంఘాల నాయకులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: