తెలంగాణకు అదిరే గుడ్‌న్యూస్‌: రూ.6200 కోట్ల పెట్టుబడి?

తెలంగాణకు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. తాజాగా డేటా సెంటర్ ఏర్పాటు సహా విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రంలో 6,200 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు క్యాపిటల్యాండ్ అనే సంస్థ ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకొంది. భారీ పెట్టుబడితో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు క్యాపిటల్యాండ్ సంస్థ తెలిపింది.

1200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్‌లోని క్లైంట్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ఇది మొత్తం 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగి ఉంంటుందని క్యాపిటల్యాండ్  సంస్థ  తెలిపింది. ఈ ఐటీపీహెచ్ డేటా సెంటర్‌ ఐదేళ్ల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని కాపిటాలాండ్ వివరించింది.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో క్యాపిటల్యాండ్  సంస్థకు  సుమారు 6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ ఉంది. ఈ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు గాను రానున్న ఐదు సంవత్సరాలలో మరో ఐదు వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు క్యాపిటల్యాండ్  సంస్థ తెలిపింది. కాపిటాలాండ్ పెట్టుబడిని స్వాగతించిన మంత్రి కేటీఆర్... దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటన్నారు. మానవ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో డేటానే కీలక పాత్ర పోషించబోతుందని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ లో రోజురోజుకూ పెరుగుతున్న ఐటీ పరిశ్రమ అవసరాలు ఈ డేటా సెంటర్ తో తీరుతాయని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ఐటీ, ఐటీ సర్వీసుల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిటల్యాండ్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని కేటీఆర్ తెలిపారు. డేటా సెంటర్ ఐదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని క్లైంట్ సీఈఓ సంజీవ్ దాస్‌ గుప్తా వివరించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం వల్లే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: