ఏపీలో ఈడీ దూకుడు.. బాబు,లోకేశ్‌ కూడానా?

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే తెలంగాణలో ఈడీ దాడులు వారం పది రోజులుగా కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఏపీలోనూ ఈడీ దూకుడు మొదలైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలపై ఇప్పుడు ఈడీ కొందరికి నోటీసులు జారీ చేసింది.

గతంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులకు ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  నోటీసులిచ్చింది. హైదరాబాద్‌ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈ పేర్కొంది. నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ ప్రత్యేక కార్యదర్శి గంటా సుబ్బారావు, ఆయన ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణప్రసాద్, మాజీ డైరెక్టర్‌ కె.లక్ష్మీనారాయణ వంటి వారికి నోటీసులు ఇచ్చింది. మొత్తం 26 మంది వ్యక్తులు, సంస్థలు ఈ కేసులో నిందితులుగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరందిరికీ ఈడీ దశలవారీగా నోటీసులు జారీ చేస్తోంది.

అయితే.. గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు స్కామ్ విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ కు కూడా పాత్ర ఉందని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. దీంతో పాటు సైబర్ నెట్ ప్రాజెక్టు విషయంలోనూ వందల కోట్లు అవకతవకలు జరిగాయని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది. జగన్ సీఎం అయ్యాక.. ఈ అంశాలపై సీఐడి విచారణ జరుపుతోంది.

ఈ సీఐడీ విచారణ సమాచారం మేరకే ఇప్పుడు ఈడీ దాడులు చేస్తోంది. నోటీసులు ఇస్తోంది. కాబట్టి.. ఈడీ వేటలో చంద్రబాబు, లోకేశ్ కూడా ఉన్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా జోగి రమేశ్‌ కూడా ఇవే మాటలు ఉన్నారు. చంద్రబాబు, నారా లోకేశ్ జైలుకు వెళ్లక తప్పదని జోగి రమేశ్ అన్నారు. మరి ఈ మాటలు నిజమవుతాయా.. ఈడీ లిస్టులో చంద్రబాబు, లోకేశ్ కూడా ఉన్నారా అన్నది ముందు ముందు తేలబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: