జగన్‌ తీరును తప్పుబడుతున్న సొంత పార్టీ నాయకులు?

సీఎం వైఎస్‌ జగన్ తీరును వైసీపీ నాయకులు తప్పుబడుతున్నారు. జగన్ చేస్తున్నది అక్షరాలా తప్పు అంటున్నారు. జగన్ తీరుతో తాము జనంలో తలదించుకుంటున్నామని చెబుతున్నారు. ఇంతకీ ఈ నేతలు ఎవరు అని అంటారా.. వారే గ్రామ సర్పంచ్‌లు.. అవును ఏపీలో గ్రామ సర్పంచుల్లో 90 శాతం మంది వైసీపీ వారే ఉన్నారు. కానీ.. గ్రామ పంచాయతీల నిధులను రాష్ట్ర వివిధ పథకాలకు తరలిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

అందుకే ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడైనా మళ్లించిన ఆర్థిక సంఘం నిధుల్ని సాధించి తీరుతామని సర్పంచులు అంటున్నారు. తిరుపతి నుంచి దిల్లీ దాకా ఆందోళనలు ఉధృతం చేస్తామని విజయవాడలో జరిగిన 2రోజుల కార్యశాలలో నిర్ణయించారు. పంచాయితీలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన రూ.6వేల కోట్ల విద్యుత్తు ఛార్జీలబకాయిల్ని రద్దు చేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్‌ చేసింది. సంక్షేమ పథకాలకు, ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన రూ.8,660 కోట్ల ఆర్థిక సంఘం నిధుల్ని తిరిగి గ్రామ పంచాయతీల ఖాతాలకు జమచేసే దాకా పోరాటం ఆపబోమంటున్నారు.

మళ్లించిన నిధుల్ని పంచాయతీలకు వెనక్కి ఇచ్చేలా సీఎం జగన్‌ మనసు మార్చాలని వేంకటేశ్వరస్వామిని కోరుతూ నెలాఖరులో తిరుపతి నుంచి తిరుమల కొండపైకి కాలి నడకన వెళ్లాలని సర్పంచులు నిర్ణయించారు. సర్పంచుల సమస్యలపై చర్చించేందుకు డిసెంబరులో అన్ని రాజకీయ పక్షాలతో కలిసి విజయవాడలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశానికి సీఎం జగన్‌తోపాటు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన నేత పవన్‌ కల్యాణ్, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీల నేతలను సమావేశానికి పిలుస్తారట.

అలాగే చలో దిల్లీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించి ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు విషయాన్ని రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తారట. అలాగే మైనర్‌ పంచాయతీలకు తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయాలని సర్పంచులు అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: