ఇక భూమి పాడైతే అంగారకుడిపైనే మన నివాసం?

అంగారకుడు.. భూమికి దగ్గరగా ఉన్న మరో గ్రహం.. ఈ గ్రహంపై జీవం ఉందా లేదా అనే విషయంపై పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన పర్సెవరెన్స్‌ రోవర్‌ గుర్తించిన కీలక ఆనవాళ్లు మన భవిష్యత్‌ పై ఆశలు రేపుతున్నాయి. అంగారకుడిలోని జెజెరో బిలం నుంచి నాసా సేకరించిన ఆర్గానిక్‌ మాలిక్యూల్స్‌ సహా పలు నమూనాల పరిశీలన ద్వారా అంగారకుడిపై పురాతన జీవాలు ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ విషయంపై కచ్చితంగా చెప్పలేనప్పటికీ భవిష్యత్తు పరిశోధనలకు మాత్రం ఇవి కీలకంగా మారనున్నాయి.

ఈ పరిశోధనల ద్వారా తేలిందేమిటంటే.. అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండి ఉండవచ్చనే అభిప్రాయం వెల్లడవుతోంది. అంగారకుడిపై పురాతన నది డెల్టాగా జెజెరో బిలాన్ని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇసుకరాయి, రాతి శిలలతో పాటు ఆర్గానిక్‌ పరమాణువులు ఉన్న బురదరాయిని రోవర్‌ గుర్తించింది. ఈ ఆర్గానిక్‌ పరమాణువులల్లో కార్బన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ అణువులతో పాటు నైట్రోజన్‌, పాస్ఫరస్‌, సల్ఫర్‌ వంటి అణువులు కూడా ఉన్నాయి.

దీన్ని బట్టి సైంటిస్టులు కొన్ని అంచనాలకు వస్తున్నారు. వందల కోట్ల ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో నీరు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే అక్కడి శిలల్లో పురాతన జీవానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. అంగారకుడిపై ఇప్పుడు లభించిన ఆర్గానిక్‌ నమూనాలను భూమిపై పురాతన జీవాలకు సంబంధించిన శిలాజాలను సంరక్షించేందుకు ఎక్కువగా వాడతారు.

అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉందని తెలిస్తే.. ఇప్పుడు ఆ గ్రహం నివాసయోగ్యమని తేలుతుంది. భవిష్యత్‌లో భూమి కాలుష్యం వల్ల నివాసయోగ్యం కాకుండాపోతే.. అంగారకుడిని మన నివాసంగా చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ.. దీనికి ప్రధాన అడ్డంకి దూరం. ఏమో.. ముందు ముందు ఎలాంటి టెక్నాలజీ వస్తుందో.. భావితరాలు ఎంతగా అభివృద్ధి చెందుతాయో చెప్పలేం కదా. ప్రస్తుతానికైతే ఆశలు రేకెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: