విశాఖపై జగన్ మరో సంచలన నిర్ణయం?

ఏపీ సీఎం జగన్ విశాఖ పట్నం పై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విశాఖను రాజధాని ప్రాంతంగా నిర్ణయించుకున్న జగన్.. అనేక అడ్డంకుల కారణంగా విశాఖ నుంచి పాలన సాగించలేకపోతున్నారు. రాజధానిని విశాఖకు మార్చలేకపోతున్నారు. అయితే.. విశాఖ అభివృద్ధి విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక తాజాగా విశాఖ గురించి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక్క విశాఖలోనే లక్ష కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు.

తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లాలో 96,250 ఇళ్లు, అనకాపల్లిలో 3,750 ఇళ్లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే  రాష్ట్ర వ్యాప్తంగా 21.3 లక్షల మంది గృహ నిర్మాణదారులకు ఇళ్లు మంజూరు చేసే పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు  విశ్వ విద్యాలయాలకు సంబంధించిన పలు చట్ట సవరణలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇవే కాకుండా యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామక ప్రక్రియలో ఎన్‌ఈటీ కచ్చితంగా పాస్ అవ్వాలంటూ సీఎం జగన్ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి వారం రోజుల పాటు దీనికింద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామ‌ని మంత్రి చెల్లుబోయిన తెలిపారు.

వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో మొత్తం 57 అంశాలకు మంత్రి మండ‌లి ఆమోద ముద్ర వేసింది. ఇవే కాకుండా ఇతర కీలక అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. ఒక్క గ్రీన్ ఎనర్జీ లోనే రూ. 81 వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. 21వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు కూడా కేబినెట్  ఆమోద ముద్ర వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: