మరో అదిరిపోయే స్కీమ్‌ ప్రారంభించనున్న జగన్‌?

ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ సర్కారు.. ఇప్పుడు మరో వినూత్న పథకంతో ప్రజల ముందుకు రాబోతోంది. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోంది.  త్వరలో ఈ ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కోసం ఓ ప్రత్యేక యాప్‌ కూడా రూపొందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే సంప్రదించేందుకు వీలుగా ప్రతి పీహెచ్‌సీ వైద్యుడికి మొబైల్‌ ఫోన్లు ఇస్తున్నారు.

ఇక గ్రామ సచివాలయాల్లోనూ వైద్యులు బయోమెట్రిక్‌ హాజరు వేయాల్సి ఉంటుంది. అంటే ఇక మీకు ఏ అనారోగ్యం వచ్చిన మీ సమీప పీహెచ్‌సీ వైద్యుడికి ఫోన్ చేసి.. సలహాలు తీసుకోవచ్చు. ఫోన్ ద్వారానే వైద్యం అందుకోవచ్చు. ఇప్పటికే టెలి మెడిసిన్‌ సేవలు అందిస్తోంది ఏపీ సర్కారు. చిన్న ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెలీమెడిసిన్‌ ఉపయోగపడుతోంది. అంతేకాదు.. ఈ టెలీ మెడిసిన్‌ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఫ్యామిలీ డాక్టర్ పథకం ద్వారా గ్రామీణ ప్రజల ముంగిటికే వైద్య సేవలను అందిస్తారు. దీని ద్వారా సచివాలయం యూనిట్‌గా ప్రతి గ్రామాన్ని పీహెచ్‌సీ వైద్యులు నెలలో రెండుసార్లు  సందర్శిస్తారు. ఒకవేళ వైద్యుడు గ్రామానికి రాని రోజుల్లో ప్రజలకు ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైతే వెంటనే ఫోన్‌ చేసేలా ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచుతారు. అందుకే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడికి ప్రభుత్వమే ఓ మొబైల్‌ ఫోన్‌ను అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 1,142 పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యులకు ఫోన్లు అందిస్తున్నారు. దీని కోసం రూ.3 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే  ఫోన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఈ ఫోన్లు పంపిణీ చేస్తున్నారు. వైద్యుడు మారినా ఈ ఫోన్‌ నంబర్‌ మాత్రం మారదు. కొత్త వైద్యుడు కూడా ఇదే ఫోన్ నెంబర్ వాడతారు. అంటే ఆ పీహెచ్‌సీకి అది పర్మనెంట్ నంబర్ అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: