ఆ యాత్రతో రాహుల్ గాంధీ.. మోడీని దాటేస్తారా?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో భారత్‌ జోడో యాత్ర చేయబోతున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ ఈ భారత్ జోడో యాత్ర చేయబోతున్నారు. తెలంగాణలో ఈ యాత్ర వివరాలను  భారత్ జోడో పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర సమన్వయ కర్త బలరాం నాయక్ వివరించారు. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర సుమారు 150 రోజుల పాటు కొనసాగనుందని బలరాం నాయక్ తెలిపారు.

అక్టోబర్ 24వ తేదీన తెలంగాణలో మక్తల్ నియోజక వర్గంలో ఈ పాదయాత్ర ప్రవేశిస్తుందన్న బలరాం నాయక్.. తెలంగాణలో 13 రోజుల నుంచి 15 రోజుల వరకు పాదయాత్ర సాగనుందని తెలిపారు. జుక్కల్ నియోజక వర్గంలో పాదయాత్ర ముగుస్తుందని.. ఈ పాదయాత్ర విషయంలో ఇప్పటికే రూట్ పరిశీలన జరిగిందని బలరాం నాయక్ వివరించారు. 330 నుంచి 370 కిలోమీటర్లు యాత్ర తెలంగాణలో ఉండే అవకాశం ఉందని.. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలతోపాటు సీనియర్ నాయకులు తెలంగాణాలో రాహుల్ గాంధీ యాత్ర విజయవంతం కోసం కృషి చేస్తున్నారని బలరాం నాయక్ తెలిపారు.

తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర పూర్తి వివరాలు త్వరలో మ్యాప్‌లతో సహా విడుదల చేస్తామన్న బలరాం నాయక్.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులు హెచ్చుపెరిగిపోతూ దేశాన్ని కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయన్న కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్.. ఈ నేపథ్యంలో దేశంలో ఐక్యత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరించి...ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఏఐసీసీ అగ్రనేత భారత్ జోడో పాదయాత్ర ను ప్రారంభిస్తున్నారన్నారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కీలకంగా మారింది. ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశాన్ని మెప్పించే నాయకుడిగా రాణిస్తారా.. మోదీకి దీటుగా నాయకుడుగా ఎదుగుతారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: