వాళ్లకు జగన్‌ ఫిక్స్ చేసిన టార్గెట్లు ఇవే?

ఏపీ సీఎం జగన్ పల్లెలపై దృష్టి సారించారు.  విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించిన జగన్.. అధికారులకు కొన్ని టార్గెట్లు ఫిక్స్ చేశారు. వాటిలో కీలకమైంది.. ఉపాధిహామీ పనుల సగటు వేతనం రూ.240 ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నది. అలాగే పూర్తికాని ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్‌క్లినిక్స్‌ను అక్టోబరు నెలాఖరుకు పూర్తి చేయాలి జగన్ టార్గెట్ పెట్టారు. 3,966 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని జగన్ లక్ష్యం నిర్దేశించారు.

ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల నిర్వహణపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని.. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఫోన్‌ నంబర్లతో బోర్డులను ఏర్పాటు చేయాలని.. అక్టోబరు 2నాటికి వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు మరియు భూ రక్షసర్వే పూర్తి కావాలని... సంబంధిత వ్యక్తుల చేతిలో జగనన్న భూ రక్ష హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. అలాగే  అక్టోబరు తర్వాత ప్రతినెలలోనూ వేయి గ్రామాల్లో సర్వే పూర్తిచేసి పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కూడా జగన్ లక్ష్యం విధించారు.

గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో నేరుగా ప్రజల వద్దకు ఎమ్మెల్యే, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు వెళ్తున్నారని.. ప్రజలనుంచి వచ్చిన వినతుల ఆధారంగా అందులో ప్రాధాన్యతా పనులుగా గుర్తించి వాటిపైన ఒక విజ్ఞప్తిని సంబంధిత ఎమ్మెల్యే పంపిస్తున్నారని అధికారులు జగన్‌కు వివరించారు. అందుకే ఈ ప్రాధాన్యతా పనులను పూర్తిచేయడానికి ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల రూపాయలను కేటాయించామని సీఎం జగన్ వారితో అన్నారు.

ఈ పనులు చేపట్టేలా, యద్ధ ప్రాతిపదికిన పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని సీఎం జగన్ అధికారులతో అన్నారు. వేగంగా పనులు చేపట్టడమే కాదు, వాటిని అంతే వేగంతో పూర్తిచేయాలని సూచించారు. దాదాపు 15వేల సచివాలయాలకు ప్రాధాన్యతా పనులకోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని సీఎం జగన్ అధికారులకు గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: