జగన్‌ కేబినెట్‌.. కాకరేపుతున్న బొత్స వ్యవహారం?

ఏపీ సీఎం జగన్ కొన్నిరోజుల క్రితం కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో మంత్రులందరినీ మార్చేస్తానని చెప్పిన జగన్.. ఆ తర్వాత మొత్తం 11 మంది మంత్రులను కొనసాగించారు. అందుకు అనేక సమీకరణాలు కారణం అయ్యాయి. ఈ మంత్రి వర్గ కూర్పుపై అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు కొన్నిరోజులు హంగామా చేసి.. ఆ తర్వాత జగన్‌ తో భేటీ తర్వాత అంతా సర్దుకున్నారు. అయితే.. ఇంత జరిగినా.. ఇంకా కొందరు మంత్రులు కూడా అసంతృప్తిగానే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

మంత్రివర్గ విస్తరణ జరిగి దాదాపు వారం దాటిపోతున్నా.. ఇంకా కొందరు మంత్రులు బాధ్యతలు స్వీకరించలేదు. ఇందుకు అనేక కారణాలు చెబుతున్నారు. అయితే.. తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తిగా ఉన్న నాయకులే ఇంకా బాధ్యతలు స్వీకరించలేదన్న టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకించి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తనకు కేటాయించిన విద్యాశాఖ పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. విద్యాశాఖ మంచి శాఖే అయినా.. గతంలో ఆయనకు కీలకమైన మున్సిపల్, పంచాయతీ రాజ్‌ శాఖలు ఉండేవి.. ఇప్పుడు ఆ శాఖలను మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కేటాయించారు.

గతంలో ఆదిమూలపు సురేశ్ చూసిన విద్యాశాఖను ఇప్పుడు బొత్సకు కేటాయించారు. అంటే బొత్స, ఆదిమూలపు సురేశ్ ల శాఖలను పరస్పరం మార్చారన్నమాట. అయితే.. ఈ మార్పు పట్ల  మంత్రి బొత్స అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఇప్పటి వరకూ బాధ్యతలు స్వీకరించలేదని అంటున్నారు. అయితే.. ఆయన తన కుటుంబంలో వివాహం ఉందని.. అందువల్లనే ఇప్పటి వరకూ బాధ్యతలు స్వీకరించలేదని చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది వాస్తవం అనే విషయం ఆ అమాత్యులకే తెలియాలి.

మరి.. ఒకవేళ బొత్స నిజంగానే తన శాఖ పట్ల అసంతృప్తిగా ఉంటే.. జగన్ దాన్ని గుర్తించి మారుస్తారా.. అసలు బొత్సకు ఓ మాట చెప్పకుండానే ఆయన శాఖ మార్చి ఉంటారా.. ఒక వేళ జగన్ మార్చాలని డిసైడ్ అయితే.. బొత్స ఒత్తిడికి లొంగుతారా.. ఇవన్నీ ఇప్పుడు సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: