ఏపీలో ఈ బీజేపీ యాత్ర.. ఓట్లు రాలుస్తుందా?

ఏపీలో పుంజుకోవాలని బీజేపీ నానా తంటాలు పడుతోంది. అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఆ పార్టీ జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర కార్యక్రమాన్నినెత్తికెత్తుకుంది. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న డిమాండ్‌తో బీజేపీ ఉత్తరాంధ్రలో ఈ యాత్ర నిర్వహిస్తోంది. ఉత్తరాంధ్ర పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల పాటు జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

నిన్న శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి సోము వీర్రాజు ఈ యాత్ర ప్రారంభించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర అనకాపల్లి జిల్లా చోడవరంలో ముగియనుంది. శ్రీకాకుళం జిల్లా  హిర మండలం వద్ద వంశధార ప్రాజెక్టును బీజేపీ నేతల బృందం పరిశీలించింది. పార్వతీపురం మన్యం జిల్లా నేరడి బ్యారేజ్ ప్రతిపాదన ప్రాంతంతో పాటు రావాడ బ్యారేజ్‌ని కూడా బీజేపీ బృందం పరిశీలించింది.

శ్రీకాకుళం జిల్లా హిర మండలం వద్ద నిర్వహించిన బహిరంగసభలో... బీజేపీ నేతలు వైసీపీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. బద్వేలు, కర్నూలు, వంశధార.. ఇలా అన్ని ప్రాజెక్టుల వద్ద రాష్ట్రవ్యాప్తంగా నిర్వాసితులు ఉన్నా ప్రభుత్వం  ఎందుకు సహాయం అందించడం లేదని సోము వీర్రాజు నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ ప్రభుత్వమే తీసుకుంటుందని ఆ పార్టీకి చెందిన మరో నేత దగ్గుబాటి పురందేశ్వరి అంటున్నారు.

అయితే.. ఇలా బీజేపీ నేతలు చేసే యాత్రలు ఓట్లు రాలుస్తాయా.. బీజేపీకి రాజకీయంగా లాభం చేకూరుస్తాయా అన్న అనుమానం లేకపోలేదు. ఎందుకంటే.. ఈ యాత్రలో జనంలో జరిగేవి కావు.. ప్రాజెక్టులను సందర్శించడం ద్వారా మీడియా కవరేజ్‌ వస్తుంది తప్ప..జనంలో పెద్దగా కదలిక ఉంటుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. కానీ.. ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. అదే చేస్తున్నారు బీజేపీ నేతలు. ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: